
హైదరాబాద్: 2022లో ఇంగ్లాండ్‌లోని బర్మింగ్ హాన్ వేదికగా జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో షూటింగ్ క్రీడను తప్పిస్తారని వస్తున్న ఊహాగానాలపై కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్య (సీజీఎఫ్) స్పందించింది. దీనిపై కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్(సీజీఎఫ్) సీఈఓ గ్రీవెంబర్గ్ వివరణ ఇచ్చాడు.
కామన్వెల్త్ గేమ్స్ నుంచి షూటింగ్ క్రీడను మొత్తానికే రద్దు చేయడం లేదని, ఆప్షనల్ కేటగిరీలో ఇది కొనసాగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'ఇంగ్లాండ్‌లోని బర్మింగ్ హామ్ వేదికగా 2022లో జరిగే కామన్వెల్త్ గేమ్స్ నుంచి షూటింగ్‌ను రద్దు చేస్తారని వస్తున్న వార్తల్లో నిజం లేదు' అని అన్నారు.
'షూటింగ్‌ను తీసేయాలన్న నిబంధనలు ఎక్కడా లేవు. ఇందులో ఎలాంటి అనిశ్చితి లేదు. బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో షూటింగ్ క్రీడ ఉండదని వస్తున్న వదంతులు తప్పు. షూటింగ్‌ను కొనసాగించాలా వద్దా అనే అంశం ఆతిథ్య నగరం నిర్ణయం తీసుకోవచ్చు. ఒకవేళ కొనసాగించినా లేకపోయినా.. షూటింగ్ మాత్రం ఆప్షనల్ కేటగిరీలో ఉంటుంది' అని చెప్పారు.
'2015 సీజీఎఫ్ జనరల్ అసెంబ్లీ ప్రకారమే షూటింగ్ ఆప్షనల్ కిందకు తీసుకొచ్చారు. మరోసారి దానిని మేం ధ్రువీకరిస్తున్నాం' అని గ్రీవెంబర్గ్ పేర్కొన్నాడు. బర్మింగ్‌హామ్‌లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో షూటింగ్ గనుక లేకపోతే భారత్ పతకాల అవకాశాలకు పెద్ద దెబ్బ.
ఎందుకంటే కామన్వెల్త్ షూటింగ్ మెడల్స్ జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉంది. భారత్ ఇప్పటివరకు 118 పతకాలు సాధించింది. ఇందులో 56 స్వర్ణాలు ఉన్నాయి.