
హైదరాబాద్: ఫార్ములావన్ సీజన్ చివరిదైన అబుదాబి గ్రాండ్‌ప్రి రేసులో మెర్సిడెస్ డ్రైవర్ వాల్తెరి బొటాస్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఈ రేసులో నిర్ణీత 55 ల్యాప్‌లను బొటాస్ గంటా 34 నిమిషాల 14.062 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు.
'పోల్ పొజిషన్'తో రేసును ఆరంభించిన బొటాస్ రేసు చివరి వరకు తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. ఈ రేసు ద్వారా 25 పాయింట్లు సొంతం చేసుకున్నాడు. బొటాస్‌కు కెరీర్‌లో ఇది మూడో విజయం. మరోవైపు చివరి ల్యాప్ వరకు గట్టిపోటీ ఇచ్చిన మరో మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ రెండో స్థానంలో నిలిచాడు.
ఫెరారీ డ్రైవర్లు వెటెల్, రైకోనెన్, వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్), హుల్కెన్‌బర్గ్ (రెనాల్ట్) వరుసగా మూడు నుంచి ఆరు స్థానాల్లో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు సెర్గియో పెరెజ్ ఏడో స్థానంలో నిలవగా, ఎస్తెబన్ ఒకాన్ ఎనిమిదో స్థానంలో నిలిచారు.
దీంతో ఫోర్స్ ఇండియా డ్రైవర్లు 6, 4 పాయింట్లు గెలుచుకున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది నిర్ణీత 20 రేసులు ముగిశాక హామిల్టన్ 363 పాయింట్లతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ సొంతం చేసుకోగా, 317 పాయింట్లతో వెటెల్ రన్నరప్‌గా, 305 పాయింట్లతో బొటాస్ మూడో స్థానంలో నిలిచారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.