
హైదరాబాద్: మనిషిని పోలిన మనుషులు ఉండటం సహజం. ఈ ప్రపంచంలో ఏదో ఒక మూలన ఒకే పోలికలతో ఉండే వాళ్లు.. ఎప్పుడో ఒక సందర్భంలో మీడియా ద్వారా బయటి వాళ్లకు తెలుస్తుంటారు. సరిగ్గా అలాంటి సంఘటనే దక్షిణకొరియా వేదికగా జరుగుతోన్న వింటర్ ఒలింపిక్స్‌లో తాజాగా చోటు చేసుకుంది.
ప్యాంగ్ చాంగ్ నగరంలో జరుగుతోన్న వింటర్ ఒలింపిక్స్‌లో ఫ్రాన్స్‌కు చెందిన అథ్లెట్ పియరీ వాల్టీర్ స్నోబోర్డ్ క్రాస్‌లో పసిడి పతకం గెలుచుకున్నాడు. అయితే ఏంటీ అనుకుంటున్నారా? అతడు అచ్చం సెర్బియాకు చెందిన టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ పోలికలతో ఉండటమే. ఈ ఇద్దరిని దగ్గరి నుంచి చూస్తే కవల సోదరుల్లాగా కనిపించడం ఖాయం.
జొకోవిచ్ రూపంతో పాటు అతనిలాగే పొడువుగా ఉండే వాల్టీర్‌కు నొవాక్ అంటే చాలా ఇష్టం. వింటర్ ఒలింపిక్స్‌లో పసిడి పతకం గెలిచిన తర్వాత ఫ్రాన్స్‌కు చెందిన ఎఫ్‌టీవీ స్పోర్ట్‌కు ఇచ్చిన ఇంటర్యూ ఇచ్చాడు. అందులో 'జొకోవిచ్ ఆడుతుంటే అతని హావభావాలు, మాటతీరు అచ్చంగా నాలాగే అనిపిస్తాయి' అని వాల్టీర్ చెప్పాడు.
'అంతేకాదు నన్ను నేనే చూసుకున్నట్లు ఉంటుంది. తాను ఎంతగానో అభిమానించే జొకోవిచ్‌ను ఒకసారి కలుసుకోవాలని ఉంది' అని వాల్టర్ తన మనస్సులో మాటను వెల్లడించాడు. దీనికి వెంటనే స్పందించిన జొకోవిచ్ 'రొలాండ్ గారోస్‌లో తప్పకుండా కలుద్దాం వాల్టీర్.. స్వర్ణం గెలిచినందుకు అభినందనలు' అని తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. మే 27న ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభం కానుంది.