సిడ్నీ: ఫిలిప్ హ్యూస్ విషాదం జరిగిన వారం రోజుల తర్వాత సీన్ అబాట్ మళ్లీ బౌలింగ్‌కు దిగాడు. అబాట్ వేసిన బౌన్సర్ తలపై తగలడంతో హ్యూస్ మృతి చెందిన విషయం తెలిసిందే. తీవ్రంగా కుమిలిపోయిన అబాట్ ఈ విషాదాంతం నుంచి బయటకు వస్తున్నట్లు కనిపిస్తోంది.
మంగళవారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన న్యూ సౌత్‌వేల్స్ నెట్ ప్రాక్టీస్‌లో అబాట్ బౌలింగ్ చేసినట్లు కొరియర్ మెయిల్ వెబ్‌సైట్ తెలిపింది. అబాట్ తిరిగి రావడం శుభపరిణామని చెప్పింది. అనూహ్య ఘటనపై క్రికెట్ ప్రపంచం అబాట్‌కు బాసటగా నిలిచింది.
22 ఏళ్ల అబాట్ మంగళవారం సిడ్నీ క్రికెట్ మైదానం నెట్స్‌లో సాధన చేశాడు. అబాట్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అతను ఒంటరిగా ఉండకుండా క్రికెట్ ఆస్ట్రేలియా జాగ్రత్త తీసుకుంది. ఆసీస్ పేసర్ బొలింజర్‌తో పాటు హ్యూస్ సోదరి మెగన్, కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఆబాట్‌కు తోడుగా ఉన్నారు. అబాట్ రెండు నెలల క్రితమే ఆస్ట్రేలియా తరఫున వన్డే, టీ20ల్లో ఆరంగేట్రం చేశాడు.

సిద్ధంగా ఉంటానో లేదో: ర్యాస్ హారిస్
భారత్‌తో తొలి టెస్టుకు తాను సిద్ధంగా ఉంటానో లేదో ఇప్పుడే చెప్పలేనని ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ర్యాస్ హారిస్ అన్నాడు. తొలి టెస్టు తన మనసులో మెదులుతోందని, ఆ మ్యాచ్ ఆడటం పైన తనకు అనుమానాలు ఉన్నాయని చెప్పాడు. ఏదీ కచ్చితంగా చెప్పలేనని, ఇంకా ఆలోచిస్తున్నానని చెప్పాడు. హ్యూస్ అంత్యక్రియలు అయ్యాక చూస్తానని చెప్పాడు.
హ్యూస్‌కు నివాళిగా ప్రత్యేక ఫొటో పోస్టు చేసిన సచిన్
సచిన్ టెండూల్కర్ ఆసీస్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్‌కు నివాళులర్పించాడు. ఈ మేరకు ట్వీట్ చేశాడు. ఫిల్ నిన్ను మిస్సవుతున్నాం, ఆటలో పర్ఫెక్షన్ కోసం నీ ఆరాటం, నేర్చుకోవడం పట్ల నీ తపన ఎంతగానో ఆకట్టుకున్నాయని పేర్కొన్నాడు. అంతేగాకుండా, హ్యూస్ తనతో కలిసి తీయించుకున్న ఫొటోను ట్విట్టర్లో పోస్టు చేశాడు. అనిల్ కుంబ్లే కూడా నివాళి తెలిపాడు. ఫిల్ హ్యూస్ ఆత్మకు శాంతి కలుగుగాక అని పేర్కొన్నాడు.