న్యూఢిల్లీ: నిషేధానికి గురైన భారత బాక్సర్ సరితా దేవికి సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. సరితా దేవిపై విధించిన నిషేధాన్ని సానుభూతితో ఎత్తివేయాలని కోరుతూ అంతర్జాతీయ బాక్సింగ్ సంఘాని(ఐబిఏ)కి భారత ప్రభుత్వం ఓ లేఖ రాసింది.
ఆమెపై నిషేధాన్ని ఎత్తివేసి, మళ్లీ ఆమెకు అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని ఐబిఏ అధ్యక్షుడు డాక్టర్ చింగ్ కౌ వును కోరింది. ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో తనకు వచ్చిన కాంస్య పతకాన్ని స్వీకరించేందుకు నిరాకరించిన నేపథ్యంలో సరితా దేవిపై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం నిషేధం విధించిన విషయం తెలిసిందే.
సరితా దేవిపై విధించిన నిషేధంపై ఐబిఏ చివరి నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా.. సరితా దేవి బేషరతుగా ఐబిఏకు క్షమాపణలు కూడా చెప్పింది. అయినప్పటికీ ఐబిఏ అధ్యక్షుడు డాక్టర్ చింగ్ ఆమె కెరీర్ ముగిసినట్లేనని పేర్కొన్నాడు.

' సరితా దేవి చాలా అణుకువ కలిగిన నేపథ్యం నుంచి వచ్చారు. ప్రతిభ, కఠిన శ్రమతో ఆమె ఈ స్థాయికి చేరుకున్నారు. ఆమెపై విధించిన నిషేధం ఇతర క్రీడాకారులపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది' అని క్రీడా శాఖ మంత్రి శర్వానంద సోనోవాల్ ఐబిఏకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా నుంచి తీవ్ర హెచ్చరిక వచ్చిన నేపథ్యంలో స్పందిస్తూ.. ఆమెకు విధించిన శిక్ష సరిపోతుందని అన్నారు. 'భారతదేశంలో బాక్సింగ్ అభివృద్ధి గురించి అన్ని విధాలుగా ఆలోచించి, అత్యంత సానుభూతితో ఆమెపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయండి. మరే ఇతర శిక్షలను వేయకండి' అని కోరారు.
కాగా, సరితా దేవితోపాటు ముగ్గురు కోచ్‌లు కూడా సస్పెండయ్యారు. ఇందులో పురుషుల కోచ్ గుర్భక్ష్ సింగ్ సందు కూడా ఉన్నారు. వీరిపై ఏఐబిఏ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇది ఇలా ఉండగా ఇటీవల సరితా దేవిపై నిషేధం ఎత్తివేసేందుకు భారత ప్రభుత్వం ముందుకు రావాలని సచిన్ టెండూల్కర్ కోరిన విషయం తెలిసిందే.