న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్‌లీగ్ (ఐఎస్‌ఎల్) టోర్నీ మూడో సీజన్ నిర్వహణకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే గత సీజన్ వరకు నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సి జట్టుకు సేవలందించిన సంజూ ప్రధాన్ పుణె వాసి. దీంతో ఎఫ్‌సి పూణె ఫ్రాంచైసీ యాజమాన్యం అభ్యర్థన మేరకు ఐఎస్‌ఎల్ - 3లో స్థానిక జట్టుకు తన ప్రతిభా పాటవాలను, శక్తియుక్తులను వినియోగించనున్నాడు.
గత సీజన్‌లో అట్టడుగు స్థానంలో ఉన్న నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సి జట్టును ఐదో స్థానానికి ప్రమోట్ కావడంలో సంజూ ప్రధాన్ పాత్ర కొట్టి పారేయలేనిది. 2012లోనే భారత్ ఫుట్‌బాల్ క్రీడలో రంగప్రవేశంచేసిన సంజూ ప్రధాన్ (26) ఎల్లవేళలా తన లక్ష్యం జట్టును విజయ తీరాలకు చేర్చడమేనంటున్నారు.
తొలి సీజన్‌లో అట్లెంటికో డీ కోల్‌కతాను సెమీ ఫైనల్స్‌కు, రెండో సీజన్‌లో నార్త్‌ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సి జట్టును ఐదో స్థానానికి తీసుకు రాగలిగానన్నారు. ప్రస్తుతం సొంత జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతో తనకు కొత్త సవాల్ ఎదురు కానున్నదన్నారు. కొత్త జట్టు నుంచి ఆడుతున్నా తన ఆటతీరు యధాతథంగా ఉంటుందని, అదే తనకు ప్రేరణ అని పేర్కొన్నారు. అట్లెంటికో డీ కోల్‌కతాలో ఉన్నప్పుడు కోచ్‌గా ఉన్న ఆంటోనియో హబాస్.. రెండో సీజన్‌లో తన ప్రతిభను గుర్తించాడని తెలిపారు. ప్రస్తుతం పుణె సిటీ ఎఫ్‌సి జట్టు కోచ్‌గా హబాస్ నియమితులు కావడంతో తనకు ఈసారి అవకాశాలు మెరుగవుతాయని ఆకాంక్షించాడు. ఆటలో తనకు అవసరమైన ఫలితాన్ని సాధించే విధంగా శిక్షణనిచ్చే అంశం తనకు పెద్ద సానుకూలాంశం అని తెలిపాడు.

ఐఎస్‌ఎల్‌తో ఆటకు ప్రాధాన్యంలో తేడా
పొఫెషనల్ క్రీడాకారుడిగా దశాబ్ద కాలం నుంచి ఆడుతున్నానని, ఐఎస్‌ఎల్‌కు, అంతకుముందు పరిస్థితులకు చాలా తేడా ఉందని తెలిపారు. గతంలో తమ మ్యాచ్‌లను టీవీల్లో అసలు ప్రసారంచేసే వారే కాదని, తమ అభిమానులకు మ్యాచ్‌లు ఎలా జరుగుతాయో తెలిసేది కాదని ఆవేదన వ్యక్తంచేశారు.
దీనివల్ల భారతీయ యువతలో ప్రతిభ దాగి ఉన్నా ఈ ఆట ఎలా ఉంటుందో అభిమానులకు తెలియదని తెలిపారు. ఐఎస్‌ఎల్ తమ ప్రతిభను తెలియజేయడమే కాక ఫుట్‌బాల్ మ్యాచ్‌ల స్థాయి పెరిగిందని పేర్కొన్నారు.
వసతుల కల్పనే కీలకం
మంచి వసతులు కల్పించడంతోపాటు భారతీయులు సైతం మెరుగైన ఆట ఆడగలరని రుజువుచేసుకొనే అవకాశం వచ్చిందన్నారు. తాను గత రెండేళ్లలోనే చాలా పురోగతి సాధించానన్న సంజూ ప్రధాన్.. ఐఎస్‌ఎల్ వల్ల భారత్ ఫుట్‌బాల్ ఆట ప్రమాణాలు మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రస్తుతం భారత్ ఫుట్‌బాల్ ప్రమాణాలపై సంతోషం, నిరాశ ఉన్నాయని తెలిపారు.
ఐఎస్‌ఎల్, ఇండియన్ లీగ్ విలీనమైనాప్రధానంగా క్రీడాకారుల పురోగతిపైనే దృష్టి సారించాలని తెలిపారు. భారత్ కోచ్‌లు మంచి శిక్షణ గలవారైనా ఐఎస్‌ఎల్‌లో విదేశీ కోచ్‌లను చూడొచ్చునన్నారు. కానీ వసతుల కల్పనలో తేడా వల్ల గతంతో పోలిస్తే తమ ఆట తీరు మెరుగైందన్నారు.
శిక్షణా విధానాలు, పద్ధతుల్లో స్వల్ప తేడాలు ఉంటాయన్నారు. జూనియర్ స్థాయి నుంచి క్రీడాకారుల ఆటపై దృష్టి సారిస్తే సత్ఫలితాలు సాధించొచ్చన్నారు. ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా తన ప్రయాణం చాలా కష్టసాధ్యమైందని, అకాడమీ స్థాయిలో పూర్తిగా వసతులు అందుబాటులో లేక ఇబ్బందులు పడినట్లు తెలిపారు. ప్రారంభ రోజుల్లో పలు సవాళ్లను ఎదుర్కొన్నట్లు చెప్పారు.