కాన్పూర్: కాన్పూర్‌లో జరుగుతున్న మూడో టెస్ట్‌లో బౌలర్లు రాణించడంతో దక్షిణాఫ్రికాను తొలి ఇన్నింగ్సులో 265 పరుగులకే భారత్ కట్టడి చేయగలింది. స్మిత్, ఆమ్లా మాత్రమే అర్థ సెంచరీలు చేయగలిగారు. భారత్ స్పిన్ మంత్రం ముందు మిగతా బ్యాట్స్ మెన్ ఎవరూ పెద్దగా నిలదొక్కుకోలేకపోయారు. కుంబ్లే స్థానంలో ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. హర్భజన్, ఇషాంత్ శర్మలు మూడేసి వికెట్లు తీశారు. తన కెరీరులో రెండో టెస్టు మ్యాచ్ మాత్రమే ఆడుతున్న పియూష్ చావ్లా కీలకమైన రెండు వికెట్లు తీశాడు. యువరాజ్, సెహ్వాగ్ చెరో వికెట్ తీశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికాకు ఓపెనర్లు మంచి ప్రారంభాన్నిచ్చారు. అయితే జట్టు స్కోరు 61 పరుగుల వద్ద మెకన్జీ (36) చావ్లా బౌలింగ్‌లో కీపర్ ధోనీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ఆమ్లా చక్కని ఆటతీరుతో ఓపెనర్ స్మిత్‌కు మంచి సహకారాన్ని అందించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఈ దశలో స్మిత్ (69) యువరాజ్ బౌలింగ్‌లో పెవిలియన్ బాట పట్టాడు. అటుపై 160 పరుగుల వద్ద ఇషాంత్‌శర్మ బౌలింగ్‌లో ఆమ్లా (51) సైతం క్రీజు నుంచి నిష్క్రమించాడు. వెంటనే 161 పరుగుల వద్ద హర్బజన్ బౌలింగ్‌లో కలీస్ (1) వెనుతిరిగాడు. కలాస్ తర్వాత డీవిల్లియర్స్ (25) చావ్లా బౌలింగ్‌లో గంగూలీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.