
హైదరాబాద్: రష్యాకు చెందిన సాహస విన్యాసాల క్రీడాకారుడు వాలెరీ రోజోవ్ మరణించాడు. 52 ఏళ్ల వాలెరీ రోజోవ్ బేస్ హిమాలయాల్లో జంపింగ్ చేస్తూ మృత్యువాతపడ్డాడు. డేర్ డెవిల్‌గా పేరుగాంచిన వాలెరీ రోజోవ్ 'సెవెన్ సమ్మిట్స్' అడ్వెంచర్ క్వెస్ట్‌లో భాగంగా హిమాలయాలకు వచ్చాడు.
ఇందులో భాగంగా శనివారం ఎవరెస్ట్ ప్రాంతంలోని 6812 మీటర్ల ఎతైన మౌంట్ అమా దాబ్లమ్ (22, 349 అడుగులు) పర్వతం నుంచి జంప్ చేశాడు. మార్గం మధ్యలో వింగ్‌సూట్‌లో సమస్య తలెత్తడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రమాద పరిస్థితులను పూర్తిస్థాయిలో విశ్లేషిస్తున్నామని సెవెన్ సమ్మిట్ క్లబ్ ఆర్గనైజేషన్ అధికారి మింగ్మా గేల్ షెర్పా తెలిపారు. ఇప్పటికీ ప్రమాదం ఎలా జరిగిందో తెలియడం లేదని ఆయన అన్నారు. వింగ్‌సూటర్‌గా ఎంతో అనుభవం ఉన్న రోజోవ్ 2016లో 7700 మీటర్ల మౌంట్ చో వుయ్‌పై నుంచి దూకి రికార్డు సృష్టించాడు.
అంతకముందు 2013లో మౌంట్ ఎవరెస్ట్ (7,220 మీటర్ల), కిలిమంజారో (5,895 మీటర్లు), వెస్ట్రన్ బ్రీచ్ వాల్ (5,460 మీటర్లు) పర్వతాల నుంచి కూడా జంప్ చేశాడు.