న్యూఢిల్లీ: బుధవారం జరిగిన ఆసియా గేమ్స్‌లో పురుషుల 60 కేజీల ఉషు సందా విభాగంలో భారత్‌కు చెందిన నరేంద్ర గ్రెవాల్ కాంస్య పతకాన్ని సాధించాడు. భారత బ్యాండ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ దూసుకుపోతోంది. మహిళల సింగిల్స్ లో ఇరాన్ క్రీడాకారిణి సొరయాను (2-0) 21-7, 21-6 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు వెళ్లింది.
ఇక 10వ ర్యాంకర్ క్రీడాకారిణి పీవీ సింధు మాత్రం నిరాశపరిచింది. 34వ ర్యాంకు క్రీడాకారిణి మనుపుట్టి బెల్లాట్రిక్స్ చేతిలో ఓటమిని చవిసూసింది. తొలి గేమ్ ను 22-20 తేడాతో 19 నిమిషాల్లో గెలిచిన సింధు, తర్వాత రెండు గేమ్స్ లో 16-21, 20-22 తేడాతో ఓడిపోయింది.

హర్యానా అథ్లెట్ దుష్యంత్ చౌహాన్ రోయింగ్‌లో పతకం సాధించాడు. ఆర్మీ క్రీడాకారుడైన దుష్యంత్ పురుషుల లైట్ వెయిట్ సింగిల్స్ స్కల్స్ ఈవెంట్‌లో మూడోస్థానంలో నిలిచి కాంస్యం అందుకున్నాడు. రోయింగ్ పురుషుల సింగిల్స్ విభాగంలో సావన్ సింగ్ కాంస్యం సాధించాడు. రోయింగ్‌లో భారత్‌కు ఇది రెండో పతకం.
ఆసియా గేమ్స్‌లో షూటింగ్ విభాగంలో భారత్‌కు కాంస్యం లభించింది. మహిళల డబుల్ ట్రూప్ టీమ్ విభాగంలో భారత్‌కు కాంస్యం దక్కింది. షూటింగ్ విభాగంలో భారత్‌కు ఇది ఏడో పతకం. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ఫైర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో హర్‌ప్రీత్‌సింగ్, గురుప్రీత్‌సింగ్, పెంబా తమాంగ్‌లతో కూడిన భారత జట్టు నాలుగోస్థానంలో నిలిచి నిరాశపరిచింది.
స్కాష్ టీమ్ ఈవెంట్‌లో దీపికా పళ్లికల్, జోష్న, అలన్‌కామోనిలతో కూడిన భారత మహిళల జట్టు పూల్-బిలో వరుసగా రెండు విజయాలు సాధించి సెమీస్‌కు చేరువైంది. ఆర్చరీ భారత ఫేవరెట్ దీపికా కుమారి మెరుగైన ప్రదర్శన కనబరిచింది. మహిళల వ్యక్తిగత రికర్వ్ ఈవెంట్ ర్యాంకింగ్ రౌండ్‌లో ఎనిమిదోస్థానంలో నిలిచిన దీపిక ప్రీక్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధించింది.