తిరువనంతపురం: బ్రెజిల్ స్టార్ పుట్‌బాల్ ఆటగాడు రొనాల్డినో సోమవారం తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తాను కారులో ప్రయాణిస్తున్న సమయంలో పనిచేయని ఓ ట్రాఫిక్ సిగ్నలింగ్ పోల్ అమాంతం పడింది. దీంతో అప్రమత్తమైన కారు డ్రైవర్ వెంటనే బ్రేక్ వేశాడు.

లేదంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. 21 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న నాగ్ జీ పుట్‌బాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తన గర్ల్ ప్రెండ్, సోదరునితో కలిసి ఆదివారం సాయంత్రం కోజికోడ్‌కు వచ్చారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం నడక్కావులోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో నాగ్ జీ ఇంటర్నేషనల్ క్లబ్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రోనాల్డినో పాల్గొన్నారు.
అనంతరం తిరిగి వెళుతుండగా ఒక్కసారిగా పనిచేయని సిగ్నలింగ్ పోల్ పడిపోయింది. రెండు సెకన్లు ఆలస్యంగా అది పడిపోయి ఉంటే ఏకంగా రొనాల్డినో ప్రయాణిస్తున్న కారుపైనే పడేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో పెనుప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.