'చావును చాలా దగ్గరగా చూశా.. అలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దు'

సాఖిర్: చావును చాలా దగ్గరగా చూశానని ఫార్ములా వన్ రేసర్, ఫ్రాన్స్ డ్రైవర్ రొమెయిన్ గ్రాస్‌జీన్ తెలిపాడు. బహ్రెయిన్ ఫార్ములా వన్ గ్రాండ్ ప్రి రేసులో గత ఆదివారం పెను ప్రమాదం తప్పింది. తొలి ల్యాప్‌లో హాస్ జట్టు డ్రైవర్ గ్రాస్‌జీన్ నియంత్రణ కోల్పోయి ట్రాక్ పక్కనున్న బారికేడ్లను ఢీకొట్టాడు. వెంటనే అతని కారులో మంటలు చెలరేగాయి. కారు కాక్‌పిట్, చాసిస్ వేర్వేరుగా రెండు ముక్కలైపోయాయి. మంటలు చెలరేగిన వెంటనే గ్రాస్‌జీన్ సమయస్ఫూర్తితో స్పందించి కారులో నుంచి బయటకు వచ్చాడు. ఆపై బారికేడ్లను దాటి సురక్షిత ప్రదేశానికి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అయితే అప్పిటికే రొమెయిన్ గ్రాస్‌జీన్ చేతులు, ఎడమకాలికి గాయాలయ్యాయి. హుటాహుటిన ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం డిశ్చార్జి అయ్యాడు. ప్రస్తుతం అతడు పూర్తిగా కోలుకున్నాడు. డిశ్చార్జి అనంతరం గ్రాస్‌జీన్ ఓ మీడియాతో మాట్లాడుతూ ప్రమాద వివరాలను వెల్లడించాడు. 'చావును చాలా దగ్గరగా చూశా. ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాక మళ్లీ మునుపటిలా ఉండలేను. కార్ అదుపు తప్పగానే సీట్ బెల్ట్ తీసేశాను. కానీ బయటకు రావడానికి ప్రయత్నిస్తుంటే.. నా హెల్మెట్‌కు ఏదో అడ్డుగా అనిపించింది. పరిస్థితిని అర్ధం చేసుకొని అలాగే ఉండిపోయా' అని గ్రాస్‌జీన్ తెలిపాడు.
'కారులో మంటలు అంటుకోవడం గమనించి ఎలాగైనా బయటపడాలని ప్రయత్నించా. ఎటువైపు కదిలినా.. సీట్‌లో నుంచి పైకి లేవలేకపోయా. దాంతో చావును అతి దగ్గరగా చూశా. ఎవరికీ ఇలాంటి పరిస్థితి రావొద్దనుకున్నా. చివరికి నా ముగ్గురు పిల్లలు గుర్తు రావడంతో వాళ్లకోసమైనా బయటపడాలని తీవ్రంగా యత్నించాను. చివరకు బయటపడ్డా. ఇప్పుడైతే ఆ ప్రమాదఘటనకు సంబంధించి భయాలేం లేవు. కానీ ఇలాంటివి మళ్లీ జరగవని కాదు. అందుకే దాని గురించి అప్పుడప్పుడూ ఆలోచిస్తుంటా' అని గ్రాస్‌జీన్ చెప్పుకొచ్చాడు.
ప్రమాదం కారణంగా రేసును గంటన్నరపాటు నిలిపివేశారు. మంటలను పూర్తిగా ఆపేశాక రేసును కొనసాగించారు. రేసు పునఃప్రారంభమయ్యాక రెండో ల్యాప్‌లోనే రేసింగ్ పాయింట్ జట్టు డ్రైవర్ లాన్స్ స్ట్రాల్ కారు పల్టీలు కొట్టి ట్రాక్ బయటకు వెళ్లింది. అతనికి ఏమీ కాలేదు. 57 ల్యాప్‌ల ఈ రేసును పోల్ పొజిషన్‌తో ప్రారంభించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ హామిల్టన్ విజేతగా నిలిచాడు. ఈ సీజన్‌లోకి హామిల్టన్‌కిది 11వ విజయం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications