రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్‌లో రెండు పతకాలకే పరిమితమైన భారత్‌కు పారాలింపిక్స్‌లో మాత్రం పతకాల పంట పండుతోంది. ఇప్పటికే ఒక స్వర్ణం, ఒక కాంస్యం రాగా, తాజాగా మరో రజత పతకం భారత్ ఖతాలో చేరింది. మహిళల షాట్‌పుట్ ఎఫ్-53 విభాగంలో దీపా మాలిక్ రజత పతకాన్ని సాధించి, భారత్ పతకాల సంఖ్యను మూడుకు చేర్చింది.
పారాలింపిక్స్‌లో పతకాన్ని గెల్చుకున్న తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించింది. షాట్‌పుట్ (ఎఫ్ 53) లో గుండును 4.61 మీటర్ల దూరం విసరడం ద్వారా రజతం గెలిచింది. బహ్రెయిన్‌కు చెందిన ఫాతిమా నెదామ్ (4.76మీ) స్వర్ణం నెగ్గగా.. దిమిత్ర కొరోకిదా (గ్రీస్; 4.28మీ) కాంస్యం గెలుచుకుంది.

హర్యానాకు చెందిన 45 ఏళ్ల దీపా మాలిక్ విజయం అందరికీ స్ఫూర్తినిచ్చేదే. నడుం నుంచి కింది భాగం అచేతనంగా మారడంతో 17 ఏళ్లుగా ఆమె చక్రాల కుర్చీకే పరిమితమైంది. అయినా పట్టుదలతో ఆటల్లో రాణిస్తోంది. ఈ పారాలింపిక్స్‌లో ఆమె షాట్‌పుట్‌తో పాటు జావెలిన్ త్రో, స్విమ్మింగ్‌లో పోటీపడింది.
దీపా మాలిక్ పేరుగా వినగానే ఒలింపిక్స్‌లో మెరిసిన జిమ్మాస్ట్ దీపా కర్మాకర్, సాక్షి మాలిక్‌లు గుర్తుకు రావడం సహజం. భారత్ తరఫున పారాలింపిక్స్‌లో ఇప్పటికే తంగవేలు, వరుణ్ సింగ్ పతకాలు గెలిచిన సంగతి తెలిసిందే.
హర్యానా రూ.4 కోట్లు:
పారాలింపిక్స్‌లో రజతం గెలిచిన దీపా మాలిక్‌కు భారీగా నగదు బహుమతి దక్కనుంది. హర్యానా క్రీడా పథకం కింద ఆమెకు రూ.4 కోట్లు అందుకోనుంది.
కాగా, పారాలింపిక్స్ హైజంప్‌లో కాంస్యం సాధించిన వరుణ్ సింగ్ బట్టిని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ అభినందించారు. అతడికి కోటి రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు. వరుణ్ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఆటగాడు.
కాగా, పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకాలు అందించిన క్రీడాకారులను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ అభినంనందించారు. వీరితోపాటు క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పతక విజేతలకు అభినందనలు తెలిపారు.

'పారాలింపిక్స్‌లో రజతం గెలిచిన దీపకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆమె విజయాన్ని దేశమంతా ఆస్వాదిస్తోంది' అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ.. 'భేష్ దీప. పారాలింపిక్స్‌లో రజతం సాధించి దేశం గర్వించేలా చేశావు. అభినందనలు' అంటూ అభినందించారు.
'దీప అభినందనలు. భారతదేశానికి నువ్వు స్ఫూర్తి' అని అభినవ్ బింద్రా అభినందించగా, 'దీప మాలిక్ గొప్ప ప్రదర్శన చేశావు. రజతం గెలిచినందుకు అభినందనలు' అంటూ కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ పేర్కొన్నారు.
కష్టాలకు ఎదురీన దీప
వెన్నెముక ట్యూమర్‌తో బాధపడుతున్న ఆమెకు మొత్తం 31 శస్త్ర చికిత్సలు జరిగాయి. నడుము నుంచి కాలి వరకూ జరిగిన ఆపరేషన్స్‌లో 183 కుట్లు పడ్డాయి. మంచానికే పరిమితం కావాల్సిన ఆమె క్రీడాకారిణిగా ఎదగడానికి అవిశ్రాంతంగా కృషి చేసింది. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో శ్రమించింది. షాట్‌పుట్‌లోనేగాక, జావెలిన్‌త్రో, స్విమ్మింగ్ విభాగాల్లోనూ మేటి పారా క్రీడాకారిణిగా గుర్తింపు సంపాదించింది.