రియో డి జెనిరో: రియో ఒలింపిక్స్ 2016లో పురుషుల నాలుగు వందల మీటర్ల ఫ్రీస్టైల్ రిలేలో అమెరికా స్వర్ణం సాధించింది. డ్రిస్సెల్, ఫెల్ప్స్, రెయన్, నాథన్‌లతో కూడిన అమెరికా స్విమ్మింగ్ బృందం 3.09.92 నిమిషాల్లో లక్ష్యాన్ని అందుకొని స్వర్ణాన్ని గెలిచింది.
ఫ్రాన్స్ రజతం, ఆస్ట్రేలియా కాంస్యంతో సరిపెట్టుకున్నాయి. దిగ్గజ స్విమ్మర్ ఫెల్ప్స్ ఈ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన తొలి ఈవెంట్‌లోనే స్వర్ణం సాధించాడు. ఈ పతకంతో ఫెల్ప్స్ ఖాతాలో 19 ఒలింపిక్స్ స్వర్ణాలు చేరాయి. ఒలింపిక్స్‌లో అత్యధిక బంగారు పతకాలను సాధించి ఆల్‌టైమ్ గ్రేట్‌గా నిలిచాడు.

ఫెల్ప్స్ ఐదోసారి ఒలింపిక్ గేమ్స్‌లో పాల్గొంటున్నాడు. 2000లో సిడ్నీలో జరిగిన ఒలింపిక్స్‌లో అతను తొలిసారి పాల్గొన్నాడు. మైకేల్ ఫెల్ప్స్ మొత్తం 23 ఒలింపిక్ మెడల్స్‌ను సొంతం చేసుకున్నాడు. అందులో 19 స్వర్ణం, రెండు కాంస్యం, రెండు వెండి పతకాలు.
ఒలింపిక్స్‌లో రెండో రోజు మొత్తం ఎనిమిది క్రీడల్లో పతక పోటీలు జరిగాయి. 3 స్వర్ణాలు, 5 రజతాలు, 4 కాంస్యాలతో మొత్తం 12 పతకాలను కైవసం చేసుకున్న అమెరికా పతకాల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది. చైనా రెండో రోజు పుంజుకుంది. 3 స్వర్ణాలు, 2 రజతాలు, 3 కాంస్యాలతో మొత్తం ఎనిమిది పతకాలు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచింది. 3 బంగారు, 3 కాంస్యాలతో ఆరు పతకాలు సాధించిన ఆస్ట్రేలియా మూడో స్థానానికి పడిపోయింది.