రియో డి జెనీరో: రియో ఒలింపిక్స్‌ో తొలి స్వర్ణ పతకం అమెరికా ఖాతాలో చేరింది. అట్టహాసంగా ప్రారంభమైన రియో ఒలింపిక్స్ క్రీడల్లో పది మీటర్ల మహిళల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో అమెరికా యువతి జిన్నీ థ్రాషర్ స్వర్ణపతకంపై గురి పెట్టి సాధించింది.
శనివారం ఉదయం జరిగిన ఈ పోటీల్లో 19 ఏళ్ల థ్రాషర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచి స్వర్ణ పతకం గెలుచుకుంది. ఫైనల్ రౌండులో 208.0 పాయింట్లు సాధించిన థ్రాషర్ చైనా షూటర్ డులీని ఓడించింది. డు లీ 207.0 పాయింట్లు సాధించి రజత పతకం పొందింది.
చైనాకు చెందిన యి సిలింగ్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం దక్కించుకుంది. దీంతో రియో ఒలింపిక్స్‌లో తొలి పతకాల్లో స్వర్ణం అమెరికాకు వెళ్లగా, రజతం, కాంస్యం చైనాకు దక్కాయి.
థ్రాషర్ ఎన్సిఎఎ చాంపియన్. ఒలింపిక్స్‌లో తొలిసారి పోటీకి దిగింది. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో డు లీ స్వర్ణ పతకం సాధించింది. సెర్బియాకు చెందిన ఆండ్రియా ఆర్సోవిక్ ప్రపంచ నెంబర్ వన్‌గా కొనసాగుతూ వచ్చింది. అయితే ఫైనల్‌కు చేరుకోవడంలో విఫలమైంది.