Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రియోలో భారత్‌కు తొలి పతకం: సాక్షి మాలిక్ అసాధారణ పోరాటం

రియో డీ జనీరో: భారత్ నిరీక్షణ ఫలించింది. ఎట్టకేలకు ఒలింపిక్స్‌లో భారత్‌ బోణీ కొట్టింది. భారత రెజ్లర్ సాక్షి మాలిక్‌ కంచు పతకం సాధించి 125కోట్ల ప్రజల ఆకాంక్షను తీర్చింది. మహిళల రెజ్లింగ్‌ 58 కిలోల విభాగంలో అసాధారణ పోరాటపటిమ ప్రదర్శించిన సాక్షి రెపిచేజ్‌ రౌండ్లలో విజయం సాధించి కాంస్యం సొంతం చేసుకుంది.

రెపిచేజ్‌ తుది పోరులో సాక్షి 8-5 తేడాతో ఐసులు టినిబెకోవా ( కిర్గిజిస్థాన్‌)పై విజయం సాధించింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు మ్యాచ్‌ల్లో అద్భుతంగా పోరాడిన సాక్షి చివరికి పతకం పట్టుకొచ్చింది. తొలి రౌండ్లో ఓటమి అంచులకు చేరి ఆఖరి పది సెకన్లలో గెలుపు రుచి చూసిన సాక్షి.. ప్రిక్వార్టర్స్‌లోనూ అసాధారణంగా పోరాడింది.

ఆ తర్వాత క్వార్టర్స్‌లో ఓడింది. ఐతే క్వార్టర్‌ఫైనల్‌ ప్రత్యర్థి ఫైనల్‌ చేరడంతో రెపిచేజ్‌కు అర్హత పొందిన సాక్షి వరుసగా రెండు మ్యాచ్‌లు నెగ్గి కాంస్యం సాధించింది. కాగా, రెపిచేజ్‌ తొలి రౌండ్లో సాక్షి 12-3తో పురెవ్‌డోర్జిన్‌ ఓర్కాన్‌ (మంగోలియా)ను చిత్తు చేసింది. పోరు ప్రథమార్ధం ముగిసేసరికి 2-2తో సమానంగా నిలిచిన సాక్షి.. ద్వితీయార్ధంలో చెలరేగిపోయింది.

ఓర్కాన్‌ పట్టు బిగించాలని ప్రయత్నించిన ప్రతీసారి ఆమెను కిందకు పడేసి.. తిప్పేసిన సాక్షి వరుస పాయింట్లు సాధించింది. అంతకుముందు తొలి రౌండ్లో సాక్షి 5-4తో జొహాన్న మాట్సన్‌ (స్వీడన్‌)పై గెలిచింది. నువ్వానేనా అన్నట్టుగా సాగిన ఈ పోరులో ప్రథమార్ధం ముగిసేసరికి సాక్షి 0-4తో వెనకబడివుంది. ఐతే ద్వితీయార్ధంలో ఆమె పోరాడింది. తొలుత రెండు పాయింట్లు గెలిచింది.

ప్రత్యర్థిని రింగులో నుంచి బయటకు నెట్టేసి మరో పాయింటు పట్టింది. ఇంకో పది సెకన్లలో మ్యాచ్‌ ముగుస్తుందనగా.. ప్రత్యర్థిని కిందకు పడేసి రెండు పాయింట్లు సాధించిన సాక్షి ముందంజ వేసింది. ప్రిక్వార్టర్స్‌లో సాక్షి 5-5తో మరియానా చెర్దివరా (మాల్దోవా)తో సమానంగా నిలిచినా.. ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించిన ఆమెకు నిర్ణేతలు విజయాన్ని కట్టబెట్టారు.

అయితే క్వార్టర్‌ఫైనల్లో సాక్షి ఓడిపోయింది. 2-9తో రష్యా ప్రత్యర్థి కోబ్లోవా జలబోవా చేతిలో పరాజయంపాలైంది. ఆ తర్వాత కోబ్లోవా ఫైనల్‌ చేరడంతో సాక్షి రెపిచేజ్‌కు అర్హత సాధించింది.

సాక్షి మాలిక్

సాక్షి మాలిక్

అంచనాలు పెట్టుకున్నవారంతా ఒకరితర్వాత ఒకరు నిష్క్రమిస్తుంటే ఎలాంటి అంచనాలు లేని సాక్షి భారత నిరీక్షణకు తెరదించింది. నిజానికి 58 కిలోల విభాగంలో గీత ఫోగట్‌ ఫేవరెట్‌.

సాక్షి మాలిక్

సాక్షి మాలిక్

2012 లండన్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించి ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించిన గీత రియోలో పతక ఫేవరెట్లలో ఒక రెజ్లర్‌. ఐతే.. ఆమె దేశానికి ఒలింపిక్‌ బెర్తు తేవడంలో విఫలమవడమే కాదు.. ఒలింపిక్స్‌ అర్హత పోటీలో క్రమశిక్షణ ఉల్లంఘించి నిషేధానికి గురైంది. దీంతో ఒలింపిక్స్‌ ముందు చివరి అర్హత టోర్నీకి గీత స్థానంలో సాక్షికి అవకాశం దక్కింది. అందివచ్చిన అవకాశాన్ని వృథా కానివ్వని ఆమె ఒలింపిక్‌ బెర్తు సాధించింది. ఇప్పుడు పతకాన్ని తెచ్చి భారతావనిని ఆనందంలో నింపింది.

సాక్షి మాలిక్

సాక్షి మాలిక్

సాక్షి ప్రతిభావంత రెజ్లర్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2014 కామన్వెల్త్‌ క్రీడల్లో రజతం నెగ్గిన సాక్షి.. ఆ తర్వాతి ఏడాది ఆసియా రెజ్లింగ్‌లోనూ కాంస్యం గెలిచింది. ఐతే స్టార్‌ రెజ్లర్‌ గీత కూడా 58 కిలోల విభాగంలోనే పోటీపడుతుండడంతో సాక్షి మాలిక్‌కు తగిన గుర్తింపు రాలేదు. భారత్‌లో రెజ్లింగ్‌ రాణిగా గుర్తింపు పొందిన గీత.. గాయం లేదంటే మరే కారణాలతోనో అంతర్జాతీయ టోర్నీలకు దూరమైతే.. సాక్షికి అవకాశం దక్కేది.

సాక్షి మాలిక్

సాక్షి మాలిక్

అలాగే రియోకు వెళ్లింది. దూకుడుగా ఆడడం సాక్షి శైలి. ప్రత్యర్థి దాడికి దిగేలోపే.. వారి కాళ్లు పట్టేసి నేర్పుగా కిందకు పడేస్తుంది. ఇప్పుడే అదే దూకుడు ఆమెకు పతకాన్ని అందించింది.

సాక్షి రికార్డు: మోడీ అభినందనలు

ఈ విజయంతో ఒలింపిక్స్ లో మెడల్ సాధించిన తొలి రెజ్లింగ్ క్రీడాకారిణిగా మాలిక్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. అంతేకాకుండా ఒలింపిక్స్ లో పతకం సాధించిన నాలుగో మహిళా క్రీడాకారిణిగానూ మాలిక్ చరిత్ర సృష్టించింది. మాలిక్ విజయం సాదించిన వెంటనే స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. పతకం సాధనతో ఆమె చరిత్ర సృష్టించిందని.. దేశంలోని క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కెసిఆర్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌లు సాక్షికి అభినందనలు తెలిపారు.

సాక్షి ఆనందం

తాను భారత్ కు ఒలింపిక్స్ తొలి పతకం అందించడం పట్ల ఎంతో ఆనందంగా ఉందని సాక్షి మాలిక్ తెలిపింది. ఏదో ఒక పతకం సాధిస్తాననే నమ్మకం తనకు ఉండేదని చెప్పింది. భారత్ కు పతకాాలు రాకపోవడంపై కొంత బాధపడ్డానని, అది తన వల్లే తీరడంతో ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపింది. మరికొంతమంది క్రీడాకారులు కూడా భారత్ కు పతకాలను అందిస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.

కాగా, సాక్షి కాంస్యం సాధించిన మరుక్షణం నుంచే ఆమె ఇంట్లో ఆనందాలు వెల్లివిరిశాయి. పటాసులు పేల్చి, మిఠాయిలు పంచుకుంటూ కుటుంబసభ్యులు సంతోషాన్ని పంచుకున్నారు. భారత్ కు సాక్షి తొలి పతకం అందించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+