ముంబై: టీమిండియా కొత్త కోచ్ ఎవరన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, ప్రస్తుతం జట్టుకు డైరెక్టర్‌గా ఉన్న రవి శాస్ర్తీని కోచ్‌గా నియమిస్తారన్న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఏడాదికి రూ. 7 కోట్లతో ఒప్పందం కూడా జరిగినట్టు ఆ వర్గాలు చెప్పాయి. అంటే మాజీ కోచ్ డంకన్ ఫ్లెచర్‌తో పోలిస్తే రూ. 2.8 కోట్లు ఎక్కువే అన్నమాట. ప్రపంచ కప్‌తో కోచ్‌గా డంకన్ ఫ్లెచర్ కాంట్రాక్టు ముగియడంతో, బిసిసిఐ కొత్త కోచ్ ఎంపికకు నడుం బిగించింది.
మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరు మొదట్లో ప్రముఖంగా వినిపించింది. అయితే, నూతనంగా ఏర్పాటు చేసిన సలహా మండలి సభ్యుడిగా సచిన్ టెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్‌తో కలిసి అతనికి చోటు కల్పించడంతో, రాహుల్ ద్రవిడ్ పేరు తెరపైకి వచ్చింది.

వ్యక్తిగత కారణాల వల్ల తాను జట్టుకు కోచ్‌గా ఉండలేనని అతను ప్రకటించాడు. ద్రవిడ్ అభిప్రాయాన్ని పరిగణకిలోకి తీసుకున్న బిసిసిఐ అతనిని భారత్ 'ఎ', అండర్-19 జట్లకు కోచ్‌గా నియమించింది.
ఫలితంగా అతని పేరు కూడా రేసులో ఉన్న వారి జాబితా నుంచి నిష్క్రమించగా, తాజాగా రవి శాస్ర్తీ పేరు వినిపిస్తోంది. డ్రెస్సింగ్ రూమ్‌లో స్ఫూర్తిధాయక రవిశాస్త్రి ఉండాల్సిందేనని టెస్ట్ కెప్టెన్ కోహ్లీ కూడా అభిప్రాయం వ్యక్తం చేయడం బోర్డు నిర్ణయాన్ని ప్రభావితం చేసిందని పేర్కొంది.