క్రిస్ట్‌చర్చ్: ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా జరిగిన మ్యాచులో వెస్టిండీస్ చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. పూర్తి ఓవర్లు కూడా ఆడలేక చేతులెత్తేసింది. 39 ఓవర్లు మాత్రమే అడి 160 పరుగులు చేసి ఆలవుట్ అయింది. దీంతో 150 పరుగుల భారీ తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. రస్సెల్ అటు బ్యాటింగ్‌లోనూ ఇటు బౌలింగ్‌లోనూ ప్రతిభ కనబరిచి పాకిస్తాన్‌ను దయ్యంలా వెంటాడాడు. వెస్టిండీస్ ఇన్నింగ్సు చివరలో 13 బంతుల్లో 42 పరుగులు చేసి పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించిన రస్సెల్ బౌలింగులోనూ రాణించి మూడు వికెట్లు తీశాడు. మక్సూద్, అక్మల్ అవుటైన తర్వాత షాహిదీ అఫ్రిదీ మాత్రమే కాస్తా రాణించాడు. అతను కూడా 28 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత పాకిస్తాన్ బ్యాటింగ్ పేక మేడలా కూలింది.
వెస్టిండీస్ టైలర్ ప్రాారంభంలోనే పాకిస్తాన్ బ్యాటింగ్‌ను తుత్తునియలు చేశాడు. ఇక ఆ తర్వాత పాకిస్తాన్ కోలుకోలేదు. అతను ఆదిలోనే మూడు వికెట్లు పడగొట్టి, పాకిస్తాన్ ఓటమిని ఖాయం చేశాడు. బెన్ రెండు వికెట్లు తీయగా, సామీ కీలకమైన దశలో మక్సూద్‌ను అవుట్ చేసి పాకిస్తాన్ ఓటమిని శాసించాడు. హోల్డర్ ఒక్క వికెట్ తీశాడు. భారత్‌తో ఓటమితోనే కుంగిపోయిన పాకిస్తాన్ వెస్టిండీస్ చేతిలో పరాభవం మరింత క్రుంగదీసే అవకాశం ఉంది.
ఐదు వికెట్లు కోల్పోయిన తర్వాత పాకిస్తాన్ స్కోరును నిలకగడగా, కాస్తా జోరుగా పెంచడానికి అక్మల్, మక్సూద్ ప్రయత్నించారు. అలా జోరుగా ఆడుతూ వచ్చిన ఉమర్ అక్మల్ రస్సెల్ బౌలింగులో 59 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. దీంతో పాకిస్తాన్ 139 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. అక్మల్‌తో కలిసి నిలకడగా ఆడుతూ వచ్చిన సోహెబ్ మక్సూద్ 50 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సామీ బౌలింగులో అవుటయ్యాడు. దీంతో పాకిస్తాన్ 105 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ఐదు వికెట్ల నష్టానికి కేవలం 25 పరుగులు చేసింది. పాకిస్తాన్ కెప్టెన్ మిస్బావుల్ హక్ కేవలం 7 పరుగులు చేసి రస్సెల్ బౌలింగులో వెనుదిరిగాడు. ఈ దశలో పాకిస్తాన్ ఆశలు పూర్తిగా అడుగంటాయి.
వెస్టిండీస్ పాకిస్తాన్‌కు చుక్కలు చూపించింది. ఐసిసి ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా శనివారం జరిగిన మ్యాచులో ఆరు వికెట్ల నష్టానికి వెస్టిండీస్ 310 పరుగులు చేసింది. ఆ తర్వాత వెస్టిండీస్ బౌలర్లు పాకిస్తాన్ బ్యాటింగ్‌ను తుత్తునియలు చేశారు. సున్నా పరుగులకే ఓ వికెట్ కోల్పోయిన పాకిస్తాన్ ఆ తర్వాత మరో పరుగుకే రెండో వికెట్ కోల్పోయి పీకల లోతు కష్టాల్లో పడింది. చివరి ఓవరులో రసెల్ 13 బంతుల్లో 42 పరుగులు చేయడంతో వెస్టిండీస్ భారీ స్కోరును సాధించింది. రస్సెల్ పాక్ బౌలర్లతో ఆటాడుకున్నాడు.

సిమన్స్ కూడా అర్థ సెంచరీ చేశాడు. రామ్‌దిన్ 51 పరుగులు చేశాడు. పాకిస్తాన్ అత్యంత దారుణంగా 3.1 ఓవర్లలో ఒక్క పరుగు మాత్రమే చేసి నాలుగు వికెట్లు కోల్పోయి కోలుకోలేని స్థితికి చేరుకుంది. పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ గుండెల్లో నిజంగానే వెస్టిండీస్ బౌలర్లు రైళ్లు పరుగెట్టిస్తున్నారు. పాక్ ఓపెనర్ నసీర్ జంషెడ్ రెండు బంతులు ఆడి సున్నా పరుగులకు అవుట్ కాగా, యూనిస్ ఖాన్ మొదటి బంతికే అవుటయ్యాడు. అహ్మద్ షెహజాద్ ఒక్క పరుగు చేసి వచ్చిన దారినే వెళ్లాడు. హరీష్ సెహైల్ కూడా డకౌట్ అయ్యాడు. దీంతో ఒక్క పరుగు మాత్రమే చేసి పాకిస్తాన్ నాలుగు వికెట్లు కోల్పోయింది. వెస్టిండీస్ బౌలర్లలో టైలర్ పాకిస్తాన్ బౌలర్లను దడదడలాడించాడు. మూడు వికెట్లు తీసి పాకిస్తాన్ వెన్ను విరిచాడు.
పాకిస్తాన్ 5 ఓవర్లలో మూడు పరుగులు మాత్రమే చేసింది. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ఆరు వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. క్రిస్ గేల్ విఫలమైనా మిగతా బ్యాట్స్‌మెన్ పాకిస్తాన్ బౌలర్ల పని పట్టారు. గేల్ 14 బంతులు ఆడి నాలుగు పరుగులు మాత్రమే చేశాడు. బ్రేవో 78 బంతుల్లో 49 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. రామ్‌దిన్ (51), సిమ్మన్స్ (50), రస్సెల్ (48) మ్యాచ్ ముఖచిత్రాన్నే మార్చేశారు. పాకిస్తాన్ బౌలర్ల బంతులను అందిన మేరకు కొడుతూ పరుగులు పిండుకున్నారు.
పాకిస్తాన్ బౌలర్లలో హరీష్ సొహైల్ రెండు వికెట్లు తీయగా, మొహమ్మద్ ఇర్ఫాన్, సోహైల్ ఖాన్, వాహబ్ రియాజ్ తలో వికెట్ తీసుకున్నారు. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ వెస్టిండీస్‌కు ఏ మాత్రం సాటి రాలేదు. తొలి మ్యాచులో పాకిస్తాన్ భారత్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే