రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అందుకున్న హారిక ద్రోణవల్లి

హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సోమవారం పద్మ అవార్డుల ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. 2019 సంవత్సరానికి గాను 112 మంది పేర్లతో పద్మ(పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ) పురస్కారాలను ఈ ఏడాది జనవరి 25న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
వివిధ రంగాల నుంచి మొత్తం 112 మందికి ఈ అవార్డులు రాగా క్రీడావిభాగం నుంచి మొత్తం తొమ్మిది మంది ఈ పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు. సోమవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ అవార్డుల కార్యక్రమంలో క్రీడా విభాగం నుంచి హారిక ద్రోణవల్లి, భజరంగ్ పునియా, ఆచంట శరత్ కమల్, ఆజయ్ ఠాకూర్‌లు పద్మ అవార్డులను అందుకున్నారు.
హారిక ద్రోణవల్లి
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. 20 ఏళ్ల వయసుకే గ్రాండ్‌మాస్టర్ అయిన హారిక.. 2007-08 సంవత్సరానికి అర్జున అవార్డు గెలిచింది. ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్‌షిప్‌లో మూడు కాంస్యాలు గెలవడంతో పాటు అంతర్జాతీయ టోర్నీల్లో మరెన్నో పతకాలు సాధించింది.
1991 జనవరి 12న గుంటూరులో జన్మించిన హారిక 2000లో స్పెయిన్‌లో జరిగిన ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో అండర్-10 బాలికల విభాగంలో రజత పతకం గెలిచి వెలుగులోకి వచ్చింది. దీంతో హారిక తల్లిదండ్రులు రమేశ్, స్వర్ణ తమ అమ్మాయికి మరింత మెరుగైన శిక్షణ ఇప్పించారు. కోచ్ ఎన్‌వీఎస్ రామరాజు వద్ద శిక్షణ తీసుకుంటూ హారిక మరింత రాటుదేలింది.
2008 ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో పసిడి సాధించిన హారిక... 2009లో ఆసియా మహిళా చాంపియన్‌గా... 2010లో కామన్వెల్త్ చాంపియన్‌గా అవతరించింది. 2011లో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా పొందిన ఆమె వరుసగా మూడు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో (2012, 2015, 2017) కాంస్య పతకాలను కూడా దక్కించుకుంది.
శరత్ కమల్
తెలుగు వాడే అయినా, తమిళనాడులో స్థిరపడి ఆ రాష్ట్రానికే ప్రాతినిధ్యం వహిస్తూ.. అనేక ప్రపంచ స్థాయిలో పోట్లీలో మెరిశాడు. ‘ట్రిపుల్ ఒలింపియన్' టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆచంట శరత్ కమల్ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మ శ్రీ అవార్డుని అందుకున్నారు. గత 16 ఏళ్లలో ఆచంట శరత్ కమల్ 60 అంతర్జాతీయ పతకాలను సాధించారు.
భజరంగ్ పూనియా
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంటున్న రెజ్లర్ భజరంగ్ పూనియా. రెజ్లింగ్‌లో 65 కేజీల విభాగంలో భజరంగ్ పూనియా ఇప్పటికే పలు అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొన్నాడు. కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్‌లో భారత్‌కు అనేక పతకాలను సాధించిపెట్టాడు. ఇటీవలే బల్గేరియాలో జరిగిన రెజ్లింగ్ పోటీల్లో స్వర్ణం పతకం సాధించాడు. ఆ స్వర్ణాన్ని వింగ్ కమాండర్ అభినందన్‌కు అంకితమిచ్చాడు.
అజయ్ ఠాకూర్
2016 కబడ్డీ ప్రపంచకప్ భారత్‌కు దక్కడంలో అజయ్ ఠాకూర్ ముఖ్యపాత్ర పోషించాడు. అజయ్ ఠాకూర్ ప్రొపెషనల్ కబడ్డీ ప్లేయర్ కాగా, ప్రస్తుతం భారత కబడ్డీ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.

క్రీడా విభాగంలో పద్మ పురస్కాలకు ఎంపికైంది వీరే
పద్మ భూషణ్: బచేంద్రీ పాల్ (ఉత్తరాఖండ్-పర్వతారోహణ)
పద్మశ్రీ: ద్రోణవల్లి హారిక (ఆంధ్రప్రదేశ్-చెస్); బజరంగ్ పూనియా (హరియాణా-రెజ్లింగ్); సునీల్ చెత్రి (తెలంగాణ-ఫుట్‌బాల్); గంభీర్ (ఢిల్లీ-క్రికెట్); ఆచంట శరత్ కమల్ (తమిళనాడు-టేబుల్ టెన్నిస్); బొంబేలా దేవి (మణిపూర్-ఆర్చరీ); ప్రశాంతి సింగ్ (ఉత్తరప్రదేశ్-బాస్కెట్‌బాల్); అజయ్ ఠాకూర్ (హిమాచల్‌ప్రదేశ్-కబడ్డీ)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications