
హైదరాబాద్: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించిన స్ప్రింటర్ హిమదాస్‌కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అభినందనలు తెలియజేశారు. ఫిన్‌లాండ్‌లోని తాంపెరెలో గురువారం జరిగిన అండర్ 20 అథ్లెటిక్స్ వరల్డ్ చాంపియన్‌షిప్ 400 మీటర్ల ఈవెంట్‌లో హిమదాస్ స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే.

18 ఏళ్ల హిమ దాస్ 51.46 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. అథ్లెటిక్స్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం రావడం ఇదే తొలిసారి. ఈ ఛాంపియన్‌షిప్‌లో పతకం గెలిచిన తొలి భారత ట్రాక్ అథ్లెట్‌గా కూడా హిమ దాస్ చరిత్ర సృష్టించింది. తద్వారా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సరసన నిలిచింది. దీంతో హిమ దాస్‌కు సెల్యూట్ చేస్తున్నట్లు రాహుల్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ కంటే ముందు హిమదాస్‌కు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ట్విట్టర్‌లో అభినందనలు తెలిపారు. మరోవైపు రొమేనియా అమ్మాయి మిక్లో రజతం (52.07సె) నెగ్గగా.. అమెరికాకు చెందిన టేలర్ మాన్సన్ (52.28) కాంస్యం గెలుచుకుంది. అసోంకు చెందిన హిమ దాస్ ఈ ఏడాది మొదట్లో గోల్ట్ కోస్ట్ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో 51.32 టైమింగ్‌తో ఆరో స్థానంలో నిలిచింది.
'హిమాదాస్...దేశం నిన్ను చూసి గర్విస్తోంది. నీకు అభినందనలు. నీవు సాధించిన ఈ విజయం నిశ్చయంగా యువ అథ్లెట్లకు స్ఫూర్తిగా నిలిస్తుంది' అని మోడీ ఆమెకు అభినందనలు తెలిపారు.