హైదరాబాద్: టెన్నిస్‌లో ఉత్తమంగా రాణిస్తున్న తెలుగమ్మాయి యడ్లపల్లి ప్రాంజల మరో అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఐటిఎఫ్ టూరింగ్ టీమ్‌లో ఆమె చోటు దక్కించుకుంది.
వచ్చే మూడు నెలల కాలంలో ఈ టీమ్ యూరప్‌లో పలు జూనియర్ టెన్నిస్ టోర్నమెంట్లలో ఆడుతుంది. ఈ టీమ్‌కు ఐటీఎఫ్, గ్రాండ్ స్లామ్ డెవలప్‌మెంట్ ఫండ్ ఆర్థిక సహాయం అందిస్తున్నాయి.

ఐటీఎఫ్ టూరింగ్ టీమ్‌లో చోటు దక్కడం పట్ల ప్రాంజల సంతోషం వ్యక్తం చేసింది. యూరప్ పర్యటన తన కెరీర్‌కు ఎంతో కీలమని తెలిపింది. హైదరాబాద్‌లోని చిన్మయ విద్యాలయలో 12వ తరగతి చదువుతున్న ప్రాంజల.. జీవీకే టెన్నిస్ అకాడమీలో శిక్షణ తీసుకుంది.
12 మంది సభ్యుల ఐటీఎఫ్ టూరింగ్ టీంకు మే 8 నుంచి 10 వరకు ఇటలీలో ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించనున్నారు. మోలినా ఇవాన్(కొలంబియా), స్వీనే డెర్మోట్(జాంబియా), బూర్జగ్లి రాబర్టాలు ఈ బృందానికి శిక్షణ ఇవ్వనున్నారు. భారత దిగ్గజ క్రీడాకారులు లియాండర్ పేస్, మహేశ్ భూపతి కూడా గతంలో ఈ టీంకు ఎంపికై కోచింగ్ తీసుకున్నవారే.