
టోక్యో: జపాన్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక టోక్యో పారాలింపిక్స్ 2020లో భారత్‌కు మరో పతకం ఖాయమయింది. ప్రపంచ నంబర్‌వన్, భారత షట్లర్ ప్రమోద్ భగత్ బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. జపాన్ ప్లేయర్ డైసుకే ఫుజిహరాతో శనివారం ఉదయం జరిగిన ఎస్‌ఎల్ 3 విభాగం సెమీ ఫైనల్‌లో 21-11, 21-16 తేడాతో ప్రమోద్ అద్భుత విజయం సాధించాడు. దీంతో ఫైనల్‌లో గెలిచినా, ఓడినా ప్రమోద్‌కు పతకం లభించనుంది. అంతేకాదు భారత్ ఖాతాలో 14వ పతకం చేరనుంది. ప్రమోద్ ప్రస్తుత ఫామ్ చూస్తే గోల్డ్ మెడల్ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ప్రపంచ నంబర్‌వన్ ప్రమోద్ భగత్ జపాన్ ప్లేయర్ డైసుకే ఫుజిహరాపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. మ్యాచ్‌ను వరుస సెట్లలో గెలిచి ఫైనల్‌కు చేరుకున్నాడు. ఈరోజు ఉదయం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో తొలి సెట్‌ని 21-11తో అలవోకగా చేజిక్కించుకున్న ప్రమోద్ భగత్‌కి.. రెండో సెట్‌లో కాస్త ప్రతిఘటన ఎదురైంది. సెట్ మధ్యలో పుంజుకున్న జపాన్ షట్లర్.. గట్టి పోటీనిచ్చాడు. కానీ చివర్లో వరుసగా పాయింట్లు సాధించిన ప్రమోద్ రెండో సెట్‌ని కూడా 21-16తో చేజిక్కించుకుని ఫైనల్‌కి దూసుకెళ్లాడు. ప్రమోద్ కేవలం 21 నిమిషాల్లో రెండవ గేమ్‌లో విజయం సాధించాడు.
వరల్డ్ ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానంలో ఉన్న ప్రమోద్.. సింగిల్స్‌తో పాటు డబుల్స్‌లోనూ పోటీపడుతుంటాడు. శుక్రవారం మిక్స్‌డ్ డబుల్స్ ఎస్ఎల్ 3 ఎస్ యూ 5 గ్రూప్ మ్యాచ్‌లో భారత ద్వయం ప్రమోద్ భగత్, పాలక్ కోహ్లీ 2-0తో ఎన్ సెన్ సూప, సిరిపాంగ్ టీమార్రమ్ ని ఓడించి సెమీ ఫైనల్‌కు వెళ్లారు. ఒడిశాకి చెందిన ప్రమోద్‌కి చిన్నతనంలోనే పోలియో సోకింది. దాంతో.. ఎడమ కాలు దెబ్బతింది. ఇక షూటింగ్ పీ 4 మిక్స్‌డ్ 50 మీటర్ల పిస్తోల్ ఈవెంట్‌లో మనీష్ నర్వాల్, సింఘ్‌రాజ్ ఫైనల్‌కు అర్హత సాధించారు. అదేవిధంగా బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్‌లో మనోజ్ సర్కార్ సెమీస్ ఓడిపోవడంతో బ్రోన్జ్ పతకం కోసం పోరాడనున్నాడు. మనోజ్ కూడా గెలిస్తే భారత్ ఖాతాలో మరో మెడల్ చేరనుంది.
పారాలింపిక్స్ 2020లో భారత్ ఇప్పటికే 13 పతకాలు దక్కగా.. ప్రమోద్ భగత్ ఆ పతకాల సంఖ్యని 14కి చేర్చాడు. ఆదివారంతో ముగియనున్న ఈ క్రీడల్లో ఇప్పటి వరకు భారత్ మొత్తం 13 (2 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్యాలు) పతకాలు సాధించింది. టోక్యో విశ్వక్రీడలకు ముందు వరకు జరిగిన పారాలింపిక్స్ క్రీడలన్నింటిలో కలిపి భారత్ 12 పతకాలే నెగ్గగా.. తాజా క్రీడల్లోనే ఆ సంఖ్యను దాటడం గమనార్హం. ఇక ప్రమోద్‌కి పసిడి లేదా రజత పతకం దక్కే అవకాశం ఉంది. టోక్యో ఒలింపిక్స్ 2020లో కూడా భారత అథ్లెట్లు సత్తాచాటిన విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మెడల్స్ సాదించారు.
పారాలింపిక్స్ జావెలిన్ త్రోలో దేశానికి స్వర్ణ పతకం అందించిన సుమిత్ అంటిల్ ఈరోజు ఢిల్లీ చేరుకున్నాడు. గతంలో ఎన్నడూ లేనంతగా అతడికి స్వాగతం లభించింది. అతడి ఫొటోలు తీసేందుకు మీడియా ఎగబడింది. సుమిత్ మద్దతుదారులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి చేరుకున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 9న టోక్యో పారాలింపిక్స్ విజేతలను స్వయంగా కలవనున్నారు. వారికి విందు కూడా ఏర్పాటు చేసినట్టు సమాచారం.