హైదరాబాద్: గోల్ కోస్ట్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ సత్తా చోటుతోంది. టోర్నీలో భాగంగా శుక్రవారం పురుషుల 50మీటర్ల పిస్టల్ ఫైనల్స్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో భారత్ పసిడి, రజత, కాంస్య పతకాలను గెలుచుకుంది.
222.4 పాయింట్లతో ప్రకాశ్ నంజప్ప పసిడి పతకం గెలుచుకోగా, అమన్‌ప్రీత్, జీతూరాయ్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచి రజత, కాంస్య పతకాలను గెలుచుకున్నారు. దీంతో ఇప్పటివరకు కామన్వెల్త్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ పతకాల సంఖ్య 13కు చేరింది.
ఇదిలా ఉంటే గురువారం జరిగిన పురుషుల 50మీ రైఫిల్ ప్రోన్‌లో గగన్ నారంగ్ రజతం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది అతనికిదే తొలి పతకం కావడం విశేషం. మరోవైపు ఇదే ఈవెంట్‌లో యువ షూటర్ స్వప్నిల్ కాంస్యం చేజిక్కించుకున్నాడు.