చెస్ వరల్డ్ కప్‌లో భారత యంగ్ గ్రాండ్‌మాస్టర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద అదరగొట్టాడు. టోర్నీలో అద్భుతంగా రాణిస్తున్న అతను పైనల్‌కు దూసుకెళ్లాడు. సెమీఫైనల్‌లో టైబ్రేకర్ ద్వారా వరల్డ్ నె.3 ఫాబియానో కరౌనాను 3.5-2.5 పాయింట్ల తేడాతో ఓడించాడు. ఇక మంగళవారం ప్రారంభమయ్యే ఫైనల్లో వరల్డ్ నెం.1 మాగ్నస్ కార్ల్‌సన్‌ను ప్రజ్ఞానంద ఢీకొట్టనున్నాడు.
అమెరికన్ గ్రాండ్ మాస్టర్ కరౌనాతో ప్రజ్ఞానంద ఆడిన తొలి రెండు సెమీస గేమ్‌లు డ్రాగా ముగిశాయి. దీంతో ఈ పోరు టైబ్రేకర్‌కు వెళ్లింది. సోమవారం జరిగిన టైబ్రేకర్‌లో మొదటి రెండు ర్యాపిడ్ గేమ్‌లలో కూడా ఫలితం తేలలేదు. ఇలాంటి సమయంలో మూడో టై బ్రేకర్ మొదలైంది. ఈ మ్యాచ్‌లో నల్లపావులతో ఆడిన ప్రజ్ఞానంద అద్భుతంగా ఆడాడు.

మొత్తమ్మీద 63 ఎత్తుల్లో కరౌనాను చిత్తు చేసి ఫైనల్ బెర్తు దాదాపు ఖాయం చేసుకున్నాడు. తన తర్వాతి గేమ్‌ను కనుక అతను డ్రా చేసుకుంటే చాలు.. ప్రజ్ఞానందకు ఫైనల్ బెర్త్ ఖాయమవుతుంది. ఇలా ఓటమి ఎదురైనా కూడా వెటరన్ కరౌనా వెనకడుగు వేయలేదు. దీంతో నాలుగో గేమ్‌లో టెన్షన్ పీక్స్ చేరింది.
కానీ ఈ గేమ్ 82 ఎత్తుల తర్వాత కరౌనా డ్రాకు అంగీకరించక తప్పని పరిస్థితి తలెత్తింది. ఈ ఫలితంతో ప్రజ్ఞానంద టైబ్రేకర్‌లో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. అంతకుముందు క్వార్టర్స్‌లో తోటీ భారతీయుడు అర్జున్‌తో ప్రజ్ఞానంద 8 గేమ్‌లు ఆడాడు. వీటిలో ఫలితం తేలకపోవడంతో ఆ మ్యాచ్ సడన్ డెత్‌కు వెళ్లింది. అందులో గెలవడంతో ప్రజ్ఞానంద కాన్ఫిడెన్స్ పెరిగిందని చెప్పొచ్చు.
కరౌనాతో సెమీఫైనల్ టైబ్రేకర్‌లో అద్భుత విజయం సాధించిన ప్రజ్ఞానంద.. ఫైనల్‌లో కార్లసన్‌కు కూడా గట్టిపోటీ ఇవ్వడం గ్యారంటీ. ఈ టోర్నీ జరుగుతున్న సమయంలోనే 18వ పుట్టిన రోజు జరుపుకున్న ప్రజ్ఞానంద.. ఈ ఫైనల్‌కు చేరే క్రమంలో రెండో సీడ్ హికారు నకమురాను కూడా ఓడించిన సంగతి మర్చిపోకూడదు.
ఇలా రెండు, మూడు సీడ్లను ఓడించిన ప్రజ్ఞానంద టైటిల్ ఫేవరెట్‌గా మారాడు. అంతేకాదు, క్యాండిడేట్స్ చెస్‌కు ఇప్పటికే అర్హత సాధించిన ప్రజ్ఞానంద.. బాబీ ఫిషర్, కార్ల్‌సన్ వంటి దిగ్గజాల తర్వాత చిన్న వయసులోనే ఈ టోర్నీకి అర్హత సాధించిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు.