
హైదరాబాద్: హంగేరీలోని బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి పూజ ధండా కాంస్య పతకం సాధించింది. 57 కేజీల ఫ్రీ స్టయిల్ విభాగంలో పూజ దండా మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది. గురువారం జరిగిన మహిళల 57 కిలోల కాంస్య పతక పోరులో పూజ దండా 10-7తో గ్రేస్ జాకబ్ బుల్లెన్ (నార్వే)పై విజయం సాధించింది.
దీంతో ప్రపంచ రెజ్లింగ్‌లో పతకం గెలిచిన నాలుగో భారత మహిళగా 24 ఏళ్ల పూజ నిలిచింది. అంతకముందు అల్కా తోమర్ (2006-59 కేజీ), బబితా ఫొగాట్ (2012-51 కేజీలు), గీత ఫొగాట్ (2012-55 కేజీలు) తర్వాత వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన నాలుగో రెజ్లర్‌గా పూజ దండా అరుదైన ఘనత సాధించింది.
బులెన్‌పై ఆధిపత్యాన్ని ప్రదర్శించిన పూజ.. రెండు సార్లు నాలుగేసి పాయింట్లు సాధించింది. రెండో నిమిషంలో ప్రత్యర్థికి పాయింట్ కోల్పోయిన పూజ ఆ తర్వాత లెగ్ పిన్ చేసి 6-1తో ముందంజ వేసింది. అయితే గ్రేస్‌ను బయటకు తోసి మరో 4 పాయింట్లతో 10-2తో ఆధిక్యంలో నిలిచింది. చివర్లో గ్రేస్ ఐదు పాయింట్లు సాధించినప్పటికీ దండానే విజయం వరించింది.
కాంస్యం కోసం జరిగిన మరో బౌట్‌లో రితూ ఫొగాట్ (50 కేజీలు) 5-10 తేడాతో ఒక్సానా లివాక్ (ఉక్రెయిన్) చేతిలో ఓటమిపాలైంది. 62 కిలోల రెపిచేజ్ రౌండ్‌లో సాక్షి మాలిక్ 2-3తో మరియానా చేతిలో ఓటమి చవిచూసింది. మరోవైపు గ్రీకో రోమన్ విభాగంలో నలుగురు భారత రెజ్లర్లు బరిలోకి దిగారు. కానీ ఒక్కరూ ఒక్క మ్యాచ్ కూడా నెగ్గలేదు.
ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు లభించిన రెండో పతకమిది. ఇంతకుముందు బజరంగ్ పునియా పురుషుల 65కేజీ విభాగంలో రజతం గెలిచిన సంగతి తెలిసిందే.