Bajrang Punia: స్టార్ రెజ్లర్‌కు ప్రధాని మోడీ ఫోన్ కాల్: కనక వర్షం..ప్రభుత్వ ఉద్యోగం

టోక్యో: జపాన్ వేదికగా సాగుతోన్న ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ 16వ రోజు భారత్ మరోసారి తన జయకేతనాన్ని ఎగురవేసింది. మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. దీనితో ఇప్పటిదాకా భారత్ సాధించిన పతకాల సంఖ్య ఆరుకు పెరిగింది. భారత స్టార్ రెజ్లర్.. బజరంగ్ పునియా అంచనాలకు మించి రాణించాడు. తన సత్తాను చాటాడు. మోకాలి నొప్పితో బాధపడుతూనే రింగ్‌లో ప్రత్యర్థిని మట్టి కరిపించాడు. దేశానికి కాంస్య పతకాన్ని అందించాడు. పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో ఘన విజయం సాధించాడు. కజకిస్తాన్‌కు చెందిన దౌలెట్ నియాజ్‌బెకొవ్‌పై ఏకపక్షంగా విజయ ఢంకా మోగించాడు. 8-0 స్కోర్ తేడాతో అతనిపై గెలిచాడు.
వార్ వన్‌సైడ్..
కొద్దిసేపటి కిందటే ముగిసిన కాంస్య పతకం కోసం సాగించిన పోరులో కజకిస్తాన్‌కు చెందిన దౌలెట్ నియాజ్‌బెకోవ్‌పై ఏకపక్షంగా విజయాన్ని సాదించాడు బజరంగ్ పునియా. 8-0తో అతను బౌట్ గెలిచాడంటే.. ఏ స్థాయిలో చెలరేగిపోయి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. 2019లో వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో అత్యంత వివాదాస్పద రీతిలో దౌలెట్ నియాజ్‌బెకోవ్.. బజరంగ్ పునియాపై విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. 9-9 స్కోర్ సమంగా ఉన్న సమయంలో 2019లో వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో దౌలెట్ గెలిచినట్లు ప్రకటించారు నిర్వాహకులు. దానికి ప్రతీకారాన్ని తీర్చుకున్నట్టయింది.. బజరంగ్‌కు.
ఆనందోత్సాహాల్లో హర్యానా..
ఈ బౌట్‌లో బజరంగ్ పునియా సాధించిన ఘన విజయాల పట్ల దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, యువజన వ్యవహారాలు-క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్, ఆ శాఖ సహాయమంత్రి నితీష్ ప్రామాణిక్, కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వంటి పలువురు ప్రముఖులు అతణ్ని అభినందనలతో ముంచెత్తుతోన్నారు. బజరంగి సాధించిన ఈ విజయం పట్ల అతని స్వగ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. బాణాసంచా కాలుస్తూ..స్వీట్లు పంచిపెడుతోన్నారు అభిమానులు. అతని కుటుంబ సభ్యుల ఆనందోత్సాహాలు నింగిని అంటాయి.
ఈ తెగువ..వెలుగుల బావుటా..
కాంస్య పతకం గెలిచిన బజరంగ్ పునియాకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. అతన్ని అభినందించారు. దేశం గర్వపడేలా, క్రీడా ప్రపంచంలో కీర్తి బావుటా ఎగిరేలా చేశారంటూ ప్రశంసించారు. యావత్ భారత దేశం ఈ విజయం పట్ల గర్విస్తోందని పేర్కొన్నారు. అసమాన పోరాటాన్ని ప్రదర్శించారని, ఆ తెగువ యువతరానికి వెలుగు బావుటా కావాలని ప్రధాని మోడీ అకాంక్షించారు. టోక్యో ఒలింపిక్స్ ప్రస్థానాన్ని విజయవంతంగా ముగించినందుకు ప్రత్యేకంగా అభినందనలను తెలిపారు ప్రధాని. ఈ సందర్భంగా బజరంగ్ పునియా ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తనకు అండగా నిలిచాయని పేర్కొన్నారు.
రూ.2.5 కోట్లు.. ప్రభుత్వ ఉద్యోగం
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన బజరంగి పునియాపై హర్యానా ప్రభుత్వం నజరానాల వర్షాన్ని కురిపించింది. ఆయనకు రెండున్నర కోట్ల రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది. అలాగే- ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇస్తామని తెలిపింది. ఈ మేరకు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్.. కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే- 50 శాతం రాయితీతో ఇంటి స్థలాన్ని ఇస్తామని తెలిపారు. దీనితోపాటు- జజ్ఝర్‌లోని బజరంగి పునియా స్వగ్రామం ఖుదాన్‌లో ఓ ఇండోర్ స్టేడియాన్ని కూడా నిర్మిస్తామని మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. బజరంగి సాధించిన ఈ విజయం ప్రతి ఒక్క పౌరుడు కూడా గర్వించదగ్గదని వ్యాఖ్యానించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications