
న్యూఢిల్లీ: పారా ఒలింపిక్స్ 2020లో ఒత్తిడి లేకుండా ఆడండని భారత అథ్లెట్లకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. పతకాల గురించి ఆలోచించొద్దని.. బాగా ఆడితే అవే వస్తాయన్నారు. పారా ఒలింపిక్స్ కోసం వెళుతున్న ప్రతిఒక్కరిలో ప్రధాని స్పార్తి నింపారు. పారా ఒలింపిక్స్ కోసం భారత దేశం నుంచి 54 మంది అథ్లెట్ల బృందం త్వరలోనే జపాన్ బయలుదేరనుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. వీరంతా అత్యుత్తమ నైపుణ్యం కలిగిన క్రీడాకారులని అభినందించారు. టోక్యోలో పారా ఒలింపిక్స్ పోటీలు ఈ నెల 24 నుంచి సెప్టెంబర్ 5వరకు జరగనున్నాయి.
54 మంది పారా అథ్లెట్లు తొమ్మిది రకాల పోటీల్లో భారత దేశం తరపున ప్రాతినిథ్యం వహించనున్నారు. ఆగస్టు 27న భారత క్రీడాకారులు అర్చరీ ఈవెంట్‌లో పాల్గొననున్నారు. అయితే పారా ఒలింపిక్స్‌లో భారత్ నుంచి ఇంత పెద్ద మొత్తంలో క్రీడాకారులు పాల్గొంటుండడం ఇదే తొలిసారి. పారా ఒలింపిక్స్ కోసం వెళ్లనున్న అథ్లెట్లతో మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీతో పాటు కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సైతం పాల్గొన్నారు. పారా అథ్లెట్లు జపాన్‌లో మరోసారి సత్తా చాటాలని ప్రధాని ఆకాంక్షించారు. వీరంతా అత్యుత్తమ నైపుణ్యం కలిగిన ఆటగాళ్లంటూ పేర్కొన్నారు.
'కరోనా వైరస్ మహమ్మారి మీ కష్టాలను రెట్టింపు చేసింది. అయినా మీరు మీ ఆటలను, సాధనను వదులుకోలేదు. అసలైన క్రీడాకారులకు ఉండాల్సిన లక్షణం ఇదే పారాలింపిక్స్‌లో మీ విజయాలు, మీరు సాధించబోయే పతకాలు దేశానికి ఎంతో ముఖ్యం. కానీ ఈ నవ భారతదేశం పతకాలు సాధించుకు రావాలంటూ మీపై ఎప్పుడూ ఒత్తిడి చేయదు. ముందుగా మీరు మీ ప్రతిభను నూటికి నూరు శాతం ప్రదర్శించండి. పతకం వస్తుందా? రాదా? అనేది తర్వాత విషయం. ముందుగా ప్రయత్నించండి.. పోయేదేంలేదు' అని ప్రధాని మోదీ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపారు.
ఈ సందర్భంగా గుజరాత్‌కు చెందిన పారా-బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పారుల్ దల్‌సుఖ్‌భాయ్ పార్మర్‌తో ప్రధాని మాట్లాడారు. 'మీరు మరో రెండేళ్లలో 50వ వసంతంలోకి అడుగపెట్టబోతున్నారు. ఇప్పటిదాకా మీరు మీ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం కోసం చాలా కష్టపడ్డారు. ఈ రాఖీ పండుగకు మీరు తప్పకుండా మీ సోదరుడికి బహుమతి ఇస్తారని (పారాలింపిక్స్‌లో పతకం సాధిస్తారని) అనుకుంటున్నా' అని ప్రధాని దల్‌సుఖ్‌భాయ్ పార్మర్‌తో అన్నారు. 'నా తండ్రి ప్రోత్సాహంతోనే నేను పారాలిపింక్స్లో పాల్గొనే స్థాయికి చేరుకున్నా. కానీ ఆయన ఇప్పుడు లేనందుకు బాధగా ఉంది. నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. నా కోచ్ నాకు అండగా నిలిచారు. కచ్చితంగా పతకం సాధించాలనే లక్ష్యంతో ఒలింపిక్స్‌కు వెళ్తున్నా' అని షూటర్ జ్యోతి బాలన్ అన్నారు.
'పారా అథ్లెట్లను మీరు ఎప్పుడు ప్రోత్సహిస్తూ వచ్చారు. ఇప్పుడు మేము మా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాం. బాల్యంలో నన్ను క్రీడలు మాని చదువుకోమని బలవంతం చేశారు.. కానీ నేను దానిని ఓ సవాల్‌గా స్వీకరించా. రియో 2016లో మెడల్ సాధించాక చాలా సంతోషపడ్డాను' అని జావెలిన్ త్రో అథ్లెట్ దేవేంద్ర జజారియా పేర్కొన్నారు. '2011 నుంచి నేను దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చా. ఇప్పుడు మరోసారి దేశం గర్వపడేలా చేసేందుకు అవకాశం వచ్చింది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా అథ్లెట్లు ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకూడదు' అని మరియప్పన్ తంగవేలు అన్నారు.