Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్‌కు బిగ్ షాక్ తగిలింది. మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్స్ చేరిన వినేష్ ఫొగట్‌పై అనర్హత వేటు పడింది. ఇంకాసేపట్లో ఫైనల్స్‌లో అమెరికాకు చెందిన రెజ్లర్ సారా హిండెబ్రాండ్‌ను ఢీ కొట్టాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె డిస్ క్వాలిఫై అయ్యారు.
ఫైనల్స్ ఆడటానికి కొద్దిసేపటి ముందు షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. వినేష్ ఫొగట్ డిస్‌క్వాలిఫై అయ్యారని భారత ఒలింపిక్స్ కమిటీ అధికారికంగా ప్రకటించింది కూడా. ఓవర్ వెయిట్ అంటే.. అధిక బరువు కారణంగా వినేష్ ఫొగట్‌పై అనర్హత వేటు పడింది. నిర్దేశిత బరువు కంటే కొన్ని గ్రాములు అధికంగా ఉండటం అనర్హత వేటుకు కారణమైంది.

మహిళల రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో ఆమె పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఇందులోనే ఆమె ఫైనల్స్‌లో అడుగుపెట్టగలిగారు. పతకాన్ని ఖాయం చేసుకోగలిగారు. ఫైనల్స్ ఓడినా వెండి పతకం మాత్రం ఖాయం. ఈ పరిస్థితుల్లో అధిక బరువు కారణంగా ఆమె అనర్హత వేటుకు గుర్యారు.
ఈ కేటగిరిలో ఆడే రెజ్లర్ 50 కేజీలు, లేదా అంతకంటే తక్కువ శరీర బరువును కలిగి ఉండాలి. నిబంధనల మేరకు ఓ 100 గ్రాముల వరకు అధిక బరువును కలిగి ఉండొచ్చు. వినేష్ ఫొగట్ మాత్రం 50 కేజీలకు మించి బరువును కలిగి ఉన్నారని, అదే అనర్హత వేటుకు కారణమైందని ఒలింపిక్స్ కమిటీ వెల్లడించింది.
మంగళవారం రాత్రి ఆమె రెండు కేజీల వరకు బరువు పెరిగినట్లు సమాచారం. మొత్తంగా 52 కేజీల బరువును కలిగి ఉన్నారని చెబుతున్నారు. దీన్ని 50 కేజీల లోపు వరకు తగ్గించుకోవడానికి మంగళవారం రాత్రంతా నిద్రాహారాలు సైతం మానివేశారని తెలుస్తోంది. అయినప్పటికీ బరువు తగ్గకపోవడం వల్ల ఫైనల్స్ ఆడకుండా అనర్హత వేటు వేయొచ్చని సమాచారం.
ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఆమెను ఓదార్చారు. ఛాంపియన్లకే ఛాంపియన్‌గా అభివర్ణించారు. దేశానికి గర్వకారకులని, ప్రతి భారతీయుడికీ స్ఫూర్తిని ఇచ్చారని అన్నారు. ఫైనల్స్ ముందు తగిలిన ఎదురుదెబ్బ తనను కలచివేస్తోందని పేర్కొన్నారు.
మాటల్లో చెప్పలేనంత ఆవేదన కలుగుతోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సవాళ్లను ఎదుర్కోవడం క్రీడాకారులు, అథ్లెట్లు, రెజ్లర్లకు కొత్తేమీ కాదని, మున్ముందు మరింత గొప్పగా రాణించాలని ఆకాంక్షిస్తోన్నట్లు మోదీ చెప్పారు. దేశ ప్రజలందరూ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు.