
హైదరాబాద్: పిటా టఫాటోఫౌ.. ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకల్లో వినూత్నంగా కనిపిస్తూ ఉంటాడు. బ్రెజిల్‌లోని రియోడీజనీరోలో జరిగిన ఒలింపిక్స్‌లో 'షర్ట్‌లెస్'గా ఒంటినిండా నూనెతో కనిపించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. టోంగా దేశానికి చెందిన పిటా టఫాటోఫౌ ప్రస్తుతం దక్షిణకొరియాలో జరుగుతోన్న వింటర్ ఒలింపిక్స్‌లో మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు.
23వ వింటర్ ఒలింపిక్స్‌కు దక్షిణకొరియాలోని ప్యాంగ్ చాంగ్ నగరం ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం వింటర్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలు బాణసంచా వెలుగుల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న పిటా.. సమ్మర్ (రియో)తో పాటు వింటర్ ఒలింపిక్స్‌లోనూ ప్రాతినిథ్యం వహించిన తొలి టోంగన్ క్రీడాకారుడిగా రికార్డు సృష్టించాడు.
రియో ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలో టోంగన్ సంప్రదాయ వేషధారణలో కనిపించి.. తమ జాతీయ పతాకాన్ని ప్రదర్శించి సెంటరాఫ్ అట్రాక్షన్‌గా పిటా టఫాటోఫౌ నిలిచిన సంగతి తెలిసిందే. సరిగ్గా అదేవిధంగా షర్ట్ లేకుండా ఒంటినిండా నూనెతో, కండలు తిరిగిన దేహంతో వింటర్స్ ఒలింపిక్స్‌లో టోంగా జాతీయ పతాకం చేతబూని నడిచాడు.
తైక్వాండో ఆటగాడు అయిన పిటా టఫాటోఫౌ ఈ సందర్భంగా మాట్లాడుతూ 'రియో తర్వాత ఎంతో ఆలోచించాను. కొత్త చాలెంజ్‌ను ఏర్పాటు చేసుకున్నా. కొత్త గేమ్ ద్వారా మళ్లీ ఒలింపిక్స్‌లో టోంగన్ తరపున బరిలోకి దిగాలని భావించా. దానికోసం ఐస్‌లాండ్‌కు వెళ్లి తీవ్రంగా శ్రమించి ప్రాక్టీస్ చేశాను. క్రాస్ కంట్రీ స్కైయింగ్‌కు అర్హత సాధించాను. పతకం సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తా' అని తెలిపాడు.