సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ అకాల మరణం యావత్ క్రీడాలోకాన్ని దిగ్ర్భాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. అతని స్నేహితురాలు మేగన్ సింప్సన్‌ను మరింత కలిచివేసింది. యాథృచ్ఛికమే అయినా హ్యూస్ తన చివరి సందేశాన్ని (మెసేజ్)ను ఆమెకు పంపించాడు.
లవ్ యూ.. మిస్ యూ.. అంటూ ఆమెకు మెసేజ్ పెట్టాడు. ఆ సమయంలో హవాయ్ విహారయాత్రలో ఉన్న సింప్సన్‌కు సిడ్నీలో తన చివరి మ్యాచ్‌లో బరిలోకి దిగే కొద్ది గంటల ముందు హ్యూస్ ఈ సంక్షిప్త సందేశాన్ని పంపాడు.

హ్యూస్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని, ఎలాంటి సమయంలోనైనా తనకు అండగా నిలబడేవాడని సింప్సన్ తెలిపింది. హ్యూస్ ఎప్పుడూ సరదాగా ఉంటూ సంతోషాలను పంచేవాడని, అలాంటి వ్యక్తి తనకు మిత్రుడు కావడం తన అదృష్టమని ఆమె పేర్కొంది.
దూరంగానే అబాట్
ఫిలిప్ హ్యూస్ తాను వేసిన బౌన్సర్‌కు గాయపడి మరణించడాన్ని సీన్ అబోట్ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాడు. సహచరులతో కలిసి నెట్స్‌లో బౌలింగ్ చేసినప్పటికీ, ఈ వారాంతంలో ఆడాల్సిన మ్యాచ్‌లకు హాజరు కావొద్దని నిర్ణయించుకున్నాడు.
హ్యూస్ గాయపడిన రోజు నుంచి అబోట్‌కు మానసిక నిపుణులు కౌన్సెలింగ్ అందిస్తున్నారు. అయితే అతను పూర్తిగా కోలుకోలేదని మ్యాచ్‌ల్లో పాల్గొనరాదన్న నిర్ణయం స్పష్టం చేస్తున్నది. వచ్చే వారాంతంలో అతను క్లబ్ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉందని న్యూ సౌత్ వేల్స్ అధికారులు ప్రకటించారు. ఆడాలా వద్దా అన్నది అబాట్ ఇష్టమని క్లబ్ ప్రకటించింది.