పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో అయిదో పతకం చేరింది. శనివారం జరిగిన మహిళల 10మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఎస్‌హెచ్-1 విభాగంలో రుబీనా ఫ్రాన్సిస్ కాంస్య పతకంతో సత్తాచాటింది. 22 షాట్లలో 211.1 పాయింట్లతో కంచు మోత మోగించింది. ఇరాన్ షూటర్ సరేహ్ జవాన్‌మర్ది 236.8 పాయింట్లతో స్వర్ణం, తుర్కియే షూటర్ ఐసెల్ ఓజ్గాన్ 231.1 పాయింట్లతో రజతం సాధించారు.
ఈ విశ్వక్రీడల్లో షూటింగ్‌లో భారత్‌కు ఇది నాలుగో పతకం కావడం విశేషం.మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్-1 విభాగంలో అవని లేఖర స్వర్ణం, మోనా అగర్వాల్ కాంస్యం పతకాలు అందుకున్న విషయం తెలిసిందే. ఇక పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మనీశ్ నర్వాల్ రజతం సాధించాడు. అలాగే మహిళల టీ-35 100 మీటర్ల పరుగులో ప్రీతి పాల్ కాంస్యం గెలిచింది.

కాగా, మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన రుబీనా ఫ్రాన్సిస్ ప్రపంచ వేదికపై పోడియానికి చేరుకోవడానికి ఎంతో శ్రమించింది. ఆమె దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినది. ఆమె తండ్రి సైమన్ ఫ్రాన్సిస్ మెకానిక్. అయితే షూటింగ్‌లో రుబీనా ఎదిగేక్రమంలో వాళ్లకు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. కాలు వైకల్యంతో పాటు ఆర్థిక ఇబ్బందులను మనో ధైర్యంతో ఎదుర్కొంటూ రుబీనా ముందుకు సాగింది.
గత టోక్యో పారాలింపిక్స్‌లో బరిలోకి దిగిన రుబీనా ఫ్రాన్సిస్ పతకాన్ని సాధించలేకపోయింది. ఏడో స్థానంతో ముగించింది. కానీ ఈసారి పతకాన్ని విడిచిపెట్టలేదు. గొప్పగా పోరాడి కంచు మోత మోగించింది. 2022లో జరిగిన ఏషియన్ పారా గేమ్స్‌లోనూ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో రుబీనా కాంస్యమే సాధించింది.