పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మూడో పతకం చేరింది. మహిళల 100 మీటర్ల టీ35 విభాగంలో భారత స్టార్ అథ్లెట్ ప్రీతి పాల్ కాంస్య పతకం సాధించింది. 14.21 సెకన్లలో రేసును ముగించి వ్యక్తిగతంగా మెరుగైన రికార్డు సాధించింది. కాగా, పారాలింపిక్స్-2024లో భారత్‌కు ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో ఇదే తొలి పతకం.
ఉమెన్స్ 100 మీటర్ల టీ35 రేసులో చైనా అథ్లెట్లు స్వర్ణం, రజతం సాధించారు. రేసును 13.58 సెకన్లలో ముగించిన జియా జౌ స్వర్ణం సాధించింది. 13.74 సెకన్లలో పరుగును పూర్తి చేసిన గౌ సిల్వర్ మెడల్ దక్కించుకుంది.అంతకుముందు ఇవాల జరిగిన షూటింగ్‌లో భారత్ ఏకంగా రెండు పతకాలతో సత్తాచాటిన విషయం తెలిసిందే. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్-1 షూటింగ్ విభాగంలో అవని లేఖర స్వర్ణం సాధించింది. టోక్యో పారిలింపిక్స్‌లోనూ అవని గోల్డ్ సాధించింది.

ఇక మోనా అగర్వాల్ కాంస్య పతకం గెలిచింది. భారత్ ఖాతాను మోనానే ఆరంభించింది. మెనా కంచు మోత మోగించిన కాసేపటికీ అవని బంగారు పతకంతో మెరిసింది. కాగా, అవని 11 ఏళ్ల వయస్సులో కారు ప్రమాదంతో పక్షవాతానికి గురైంది. అప్పటి నుంచి వీల్ చైర్‌కే పరిమితమైంది. కానీ షూటింగ్‌లో సత్తాచాటుతూ టోక్యోలో భారత్‌కు గోల్డ్ అందించింది. అదే జోరును పారిస్ పారాలింపిక్స్‌లోనూ కొనసాగించింది.
పసిడి పతకాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా, 249.7 పాయింట్లతో తన రికార్డును మెరుగుపర్చుకుంది. టోక్యో అవని 249.6 పాయింట్లు సాధించింది. మరోవైపు మోనాకు ఇది తొలి పారాలింపిక్స్. తాను పాల్గొన్న తొలి విశ్వక్రీడల్లోనే మోనా కంచు మోత మోగించి భారత షూటింగ్‌లో భవిష్యత్ తారగా సత్తాచాటింది.