పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో శుక్రవారం భారత్ స్వర్ణంతో సహా ఏకంగా నాలుగు పతకాలు సాధించింది. షూటింగ్‌లో మూడు, పరుగు పందెంలో ఓ పతకం నెగ్గింది. ఉమెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్-1 విభాగంలో అవని లేఖర స్వర్ణం, మోనా అగర్వాల్ కాంస్యం పతకాలు అందుకున్నారు. మెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మనీశ్ నర్వాల్ రజతం సాధించాడు. మహిళల టీ-35 100 మీటర్ల పరుగులో ప్రీతి పాల్ కాంస్యం గెలిచింది.
షూటర్ అవని లేఖర వరుసగా రెండు పారాలింపిక్స్ స్వర్ణం సాధించిన అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. టోక్యో పారాలింపిక్స్‌లో ఆమె స్వర్ణం, కాంస్యం నెగ్గింది. అయితే అవని పోరాటం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. అవని.. రాజస్థాన్‌లోని జైపుర్‌కు చెందినది. పదేళ్ల పాటు ఆమె జీవితం హాయిగా సాగింది. కానీ 11 ఏళ్ల వయస్సులో జరిగిన కారు ప్రమాదం ఆమె జీవితాన్ని మలుపు తప్పింది.

నడుమ కింద భాగం చచ్చుపడిపోయింది. వీల్‌చైర్‌కే పరిమితమైంది. కానీ ఆమె తండ్రి ప్రోత్సాహంతో ఆటల వైపు మళ్లింది. అయితే అవని ఆది నుంచి షూటింగ్‌లోనే శ్రమించలేదు. తొలుత ఆమె ఆర్చరీలో శిక్షణ పొందింది. తర్వాత తుపాకి చేతపట్టింది. 2008 ఒలింపిక్స్ స్వర్ణ విజేత అభినవ్ బింద్రా స్ఫూర్తితో ఆమె షూటింగ్ ఎంచుకోవడం విశేషం.
2015లో అవని పారా జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత ఆమె వెనుదిరిగిచూడలేదు. క్రమంగా అంతర్జాతీయ వేదికలపై సత్తాచాటింది. ప్రపంచ రికార్డులు బద్దలుకొట్టింది. అయితే పారిస్ పారాలింపిక్స్ ముంగిట ఆమె తీవ్రంగా శ్రమించింది. శస్త్రచికిత్స చేయించుకుని తిరిగి గన్ పట్టుకోవడానికి విపరీతంగా కష్టపడింది.

రాళ్ల కారణంగా తీవ్రమైన నొప్పిని ఎదుర్కొంటున్న ఆమె ఈ ఏడాది మార్చిలో శస్త్రచికిత్సతో పిత్తాశయాన్ని తొలగించుకుంది.రెండు నెలలు విశ్రాంతి తీసుకుంది. ఆ తర్వాత క్రమంగా కోలుకుని విశ్వక్రీడలకు సిద్ధమై పసిడి సాధించింది. 10మీ.ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ప్రోన్ ఎస్‌హెచ్1, మహిళల 50మీ.రైఫిల్ 3 పొజిషన్స్‌లోనూ అవని పోటీపడనుంది.