ఎన్నో అంచనాల మధ్య పారిస్ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన భారత క్రీడాకారులు ఆరు పతకాలతోనే సరిపెట్టారు. ఒక్క స్వర్ణమూ సాధించలేదు. అయితే ఇప్పుడు అదే వేదికపై సత్తాచాటడానికి మన యోధులు సిద్ధమయ్యారు. తమ వైకల్యాన్ని దాటి పతక వేటకు సై అంటున్నారు. రేపటి నుంచే పారిస్ పారాలింపిక్స్! అయితే ఈ విశ్వక్రీడల్లో కచ్చితంగా పసిడే సాధించే సత్తా ఉన్న మన క్రీడాకారుల గురించి ఓ లుక్ వేద్దాం..
పారాలింపిక్స్ ఆర్చరీలో భారత్‌కు తొలి స్వర్ణం సాధించడానికి శీతల్ దేవి సిద్ధమైంది.ఈ విభాగంలో మనకు ఇప్పటివరకు ఒక్కసారి కూడా పసిడి దక్కలేదు. కానీ శీతల్‌తో ఈ సారి గోల్డ్ ఖాయంగా కనిపిస్తోంది. గత కొన్నాళ్లుగా 17 ఏళ్ల శీతల్ అంతర్జాతీయ వేదికపై అసాధారణ విజయాలు సాధిస్తోంది. రెండు చేతులు లేకపోయినా కాలితో విల్లును పట్టి, భుజంతో నారిని లాగి బాణాలు సంధిస్తోంది. ఈ విశ్వక్రీడల్లో ఆమె మహిళల వ్యక్తిగత, మిక్స్‌డ్ టీమ్ విభాగాల్లో పోటీపడనుంది.

శీతల్ దేవితో పాటు మరో ఆర్చర్ హర్విందర్ సింగ్ దేశానికి స్వర్ణం సాధించేలా పట్టుదలతో ఉన్నాడు. టోక్నో పారాలింపిక్స్‌లో హర్విందర్ కంచు మోత మోగించాడు. దేశానికి తొలి పతకం అందించిన పారా ఆర్చర్‌గా ఘన చరిత్ర అందుకున్నాడు. ఈ సారి కాంస్యాన్ని స్వర్ణంగా మార్చాలనుకుంటున్నాడు. టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవీనా బెన్ కూడా పసిడిపై గురిపెట్టింది. ఆమె టోక్యోలో క్లాస్ 4లో రజతం గెలిచింది.
బ్యాడ్మింటన్‌లో ఈసారి భారీ అంచనాల మధ్య మనోళ్లు బరిలోకి దిగుతున్నారు. గత టోక్యోలో స్వర్ణం సాధించిన కృష్ణ నగార్ సింగిల్స్ ఎస్‌హెచ్6 విభాగంలో టైటిల్ నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. ఇక గత పారాలింపిక్స్‌లో రజతం గెలిచిన ఐఏఎస్ అధికారి సుహాస్ యతిరాజ్ ఈ సారి గోల్డ్‌పై ఫోకస్ పెట్టాడు. ఎస్‌ఎల్4 సింగిల్స్‌తో పాటు మిక్స్‌డ్ డబుల్స్ లోనూ అతను పోటీపడనున్నాడు. అలాగే మహిళా షట్లర్లు మానసి జోషి, తులసిమతి కూడా ఫేవరేట్‌గా పోటీకి సిద్ధమయ్యారు. డోపింగ్ నిబంధనల ఉల్లంఘనతో నిషేధం ఎదుర్కొంటున్న స్వర్ణ విజేత ప్రమోద్ భగత్ ఈ సారి క్రీడలకు దూరమైన విషయం తెలిసిందే.
భారత పారా జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్ మరోసారి స్వర్ణంతో సత్తాచాటాలని భావిస్తున్నాడు. అంతేగాక తన పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాలని పట్టుతలతో ఉన్నాడు. గత టోక్యో పారాలింపిక్స్ పురుషుల ఎఫ్64 విభాగంలో సుమిత్ 68.55మీ ఈటెను విసిరి ఛాంపియన్‌గా నిలిచాడు. అయితే గతేడాది ఆసియా పారా క్రీడల్లో సుమిత్ 73.29మీ విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇక పారా హైజంప్ అథ్లెట్ మరియప్పన్ తంగవేలు, డిస్కస్‌త్రో ప్లేయర్ యోగేశ్ కథునియా, షూటర్ అవని లేఖరా కూడా ఈ సారి స్వర్ణంపై గురిపెట్టారు.