పారిస్ పారాలింపిక్స్‌లో రెండు రోజులు ముగిశాయి. ఊహించినట్లుగానే చైనా 25 పతకాలతో అగ్రస్థానంలో ఉంది. 12 స్వర్ణాలు, 9 రజత, 4 కాంస్య పతకాలు నెగ్గింది. ఇక బ్రిటన్ (15), బ్రెజిల్ (13), నెదర్లాండ్స్ (6) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఓ స్వర్ణంతో నాలుగు పతకాలు సాధించిన భారత్ 17వ స్థానంలో ఉంది.
మూడో స్థానంలో ఉన్న బ్రెజిల్‌కు స్విమ్మర్ గాబ్రియల్ తొలి పతకాన్ని అందించాడు. అయితే గాబ్రియల్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. చేతులు లేకుండా డాల్ఫిన్ తరహాలో ఈత కొట్టి స్వర్ణం గెలిచిన గాబ్రియెల్‌ను కొనియాడుతూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. పారా గేమ్స్‌లో అందరూ వైకల్యంతోనే పతక లక్ష్యంగా బరిలోకి దిగుతారు. కానీ కొందరి శారీరక లోపాలు, వాళ్ల పోరాటం కన్నీళ్లు తెప్పించేలా ఉంటాయి.

స్వర్ణ విజేత గాబ్రియల్ పోరాటం కూడా కన్నీళ్లు తెప్పించేలా ఉంది. పుట్టుకతోనే ఫోకోమెలియా అనే వ్యాధి బారిన పడటంతో గాబ్రియల్ రెండు చేతుల్ని కోల్పోయాడు. అంతేకాక కాళ్లు కూడా అచేతనంగా మారిపోయాయి. అయినా గాబ్రియల్ మనోధైర్యంతో ముందుకు సాగాడు. క్రీడలపై మక్కువ పెంచుకుని కొలనులోకి దూకాడు. పారిస్ పారాలింపిక్స్‌లో ఎస్2 కేటగిరి 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో పసిడి సాధించాడు.
పారిలింపిక్స్‌లో గాబ్రియెల్‌కు ఇది మూడో స్వర్ణం కావడం విశేషం. టోక్యో పారాలింపిక్స్‌లో మెన్స్ 200 మీటర్ల ఫ్రీస్టైల్ ఎస్2లో, మెన్స్ 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఎష్2 విభాగాల్లో పసిడి నెగ్గాడు. కాగా, మూడోసారి స్వర్ణం నెగ్గిన గాబ్రియెల్‌కు ప్రేక్షకులంతా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు.