మరో మెగా క్రీడా సంబరానికి వేళైంది. ఇవాళ నుంచి పారిస్ వేదికగా పారాలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. పారిస్ ఒలింపిక్స్‌లో ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన భారత క్రీడాకారులు ఆరు పతకాలతోనే సరిపెట్టారు. ఒక్క స్వర్ణమూ సాధించలేదు. అయితే ఇప్పుడు అదే వేదికపై సత్తాచాటడానికి మన యోధులు సిద్ధమయ్యారు. తమ వైకల్యాన్ని దాటి పతక వేటకు సై అంటున్నారు.
ఈ మెగా సమరంలో 4400 మంది పారా అథ్లెట్లు పాల్గొంటున్నారు. 22 క్రీడాంశాల్లో పోటీపడనున్నారు. భారత్ నుంచి ఈసారి 84 మంది క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారు. గత టోక్నో పారాలింపిక్స్‌లో సాధించిన 19 ఒలింపిక్స్‌ను అధిగమించి ఈసారి కనీసం 25 మెడల్స్‌ను గెలవాలని పట్టుదలతో ఉన్నారు. 2016లో భారత్ నాలుగు పతకాలే సాధించింది.

దివ్యాంగ క్రీడాకారులు పోటీపడే ఈ విశ్వక్రీడల్లో 168 దేశాలు బరిలోకి దిగుతున్నాయి. ఎనిమిది మంది శరణార్థ అథ్లెట్లుగా పోటీకి వస్తున్నారు. ఇక అత్యధికంగా చైనా నుంచి పాల్గొంటున్నారు. ఏకంగా 282 మంది పోటీకి సిద్ధమయ్యారు. వీరిలో 124 మంది పురుషులు, 158 మంది మహిళలు ఉన్నారు. చైనా తర్వాతి స్థానంలో బ్రెజిల్ (255) ఉంది.
ఇక భారత్ నుంచి బరిలోకి దిగే 84 మంది క్రీడాకారుల్లో అత్యధికంగా అథ్లెటిక్స్‌కు పోటీపడనున్నారు. ఆ తర్వాత బ్యాడ్మింటన్‌లో అత్యధికంగా తలపడనున్నారు. అథ్లెటిక్స్ (38), బ్యాడ్మింటన్ (13), షూటింగ్ (10), ఆర్చరీ (6), పవర్‌లిఫ్టింగ్ (4), పారా కనోయింగ్ (3), సైక్లింగ్, జూడో, టేబుల్ టెన్నిస్, రోయింగ్ (2), తైక్వాండో, స్విమ్మింగ్ (1) మన అథ్లెట్లు పోటీపడుతున్నారు. కాగా, పారాలింపిక్స్ లైవ్ స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్‌లో ప్రసారం కానుంది. ఇక మొబైల్స్‌లో వీక్షించాలంటే జియోసినిమా యాప్ లేదా వెబ్‌సైట్ నుంచి చూడవచ్చు. ఇవాళ రాత్రి 11.30 గంటలకు ఓపెనింగ్ సెర్మనీ జరగనుంది.