పారిస్ ఒలింపిక్స్-2024కు రంగం సిద్ధమైంది. మరో ఆరు రోజుల్లో విశ్వక్రీడలు ప్రారంభంకానున్నాయి. జులై 26 నుంచి మొదలయ్యే ఈ మహా సమరం ఆగస్టు 11 వరకు కొనసాగనుంది. ఈ సారి ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలు భిన్నంగా జరగనున్నాయి. పారిస్‌లో ప్రవహించే సెన్ నదిపై ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించనున్నారు. ఆరంభోత్సవ వేడుకలు స్టేడియంలో కాకుండా ఆరుబయట నదిలో జరగనుండటం ఇదే ప్రథమం.
అయితే క్రీడాకారుల కోసం 'ఒలింపిక్ విలేజ్'లో ఈ సారి భిన్నమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పోటీ సమయంలో అథ్లెట్లు శృంగారంలో పాల్గొనకుండా నిరోధించడానికి యాంటీ సెక్స్ బెడ్స్ సిద్ధం చేశారు. అంతేగాక బెడ్ సైజ్‌ను చిన్న పరిణామంలో తయారుచేశారు. కరోనా కారణంగా గత టోక్యో ఒలింపిక్స్‌లో సాన్నిహిత్యంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. కఠిన నిబంధనల మధ్య గత విశ్వక్రీడలు జరిగాయి.

ఈ సారి ఆంక్షలు ఎత్తివేశారు. ఈ నేపథ్యంలో ప్రేమ నగరం పారిస్‌లో క్రీడాకారుల కోసం ఏకంగా దాదాపు 3లక్షల కండోమ్‌లను అందుబాటులో ఉంచుతున్నారు. అయితే మరోవైపు నిర్వాహకులు శృంగారాన్ని అడ్డుకోవడానికి కూడా ప్రయత్నించడం గమనార్హం. ఇద్దరు వ్యక్తులు సౌకర్యవంతంగా కౌగిలించుకొని పడుకోవడానికి వీళ్లేకుండా బెడ్ పరిమాణం ఉంచారు. అంతేగాక బెడ్‌లను సెక్స్ నిరోధించే పదార్థాలతో తయారుచేశారట. వీటిని జపనీస్ కంపెనీ ఎయిర్‌వేవ్ తయారుచేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కూడా ఈ కంపెనీనే బెడ్‌లు ఏర్పాట్లు చేసింది.
ఒలింపిక్ క్రీడా గ్రామంలో సెక్స్ గురించి ఎన్నో దశాబ్దాలుగా డిబేట్ జరుగుతూనే ఉంది. 2000 సిడ్నీ గేమ్స్‌లో తొలుత 70 వేల కండోమ్‌లు అందుబాటులో ఉంచారు. అవి సరిపోలేదు. దీంతో మరో 20వేల కండోమ్‌లు ఆర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత నుంచి విశ్వక్రీడల్లో కనీసం లక్ష కండోమ్‌లను అందుబాటులో ఉంచుతున్నారు. ఈ సారి వాటి సంఖ్యను మూడు లక్షలకు పెంచారు. హెచ్‌ఐవీ-ఎయిడ్స్‌పై అవగాహన కల్పించే ఉద్దేశంతో కండోమ్‌లను అందుబాటులో ఉంచడం సియోల్ ఒలింపిక్స్-1988 నుంచి కొనసాగుతోంది. టోక్యో ఒలింపిక్స్‌లో సాన్నిహిత్యంపై నిషేధం విధించినప్పటికీ దాదాపు లక్షన్నర కండోమ్‌లను అందుబాటులో ఉంచారు.