పారిస్ ఒలింపిక్స్- 2024 ప్రారంభోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి.చరిత్రలో నిలిచేలా ఈ వేడుక సాగింది. సెన్ నదిపై ఆరు కిలోమీటర్ల పరేడ్‌లో 85 పడవలపై దాదాపు 6800 క్రీడాకారులు పాల్గొన్నారు. సుమారు 3,20,000 మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. చిన్న పడవలో ఓ ముసుగు వ్యక్తి ఒలింపిక్ జ్యోతి పట్టుకుని రావడంతో ఈ కార్యక్రమం ఆరంభమైంది.
ఆ తర్వాత గ్రీస్ బృందం పరేడ్‌లో పాల్గొంది.అక్కడి నుంచి ఫ్రెంచ్ అక్షర క్రమంలో మిగతా దేశాలు పరేడ్‌లో పాల్గొన్నాయి. 84వ దేశంగా భారత్ వచ్చింది. పరేడ్‌లో భారత క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ దిగ్గజం శరత్ కమల్ పతాకధారులుగా వ్యవహరించారు. సంప్రదాయ భారతీయ దుస్తుల్లో మన క్రీడాకారులు వేడుకల్లో పాల్గొన్నారు. శనివారం తమ పోటీలు ఉన్న కొందరు క్రీడాకారులు వేడుకకు దూరంగా ఉన్నారు.

అయితే పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. ఆరంభ వేడుకల్లో నిర్వాహకులు 'సిస్టర్ హుడ్'ను ప్రదర్శించారు. ఫ్రాన్స్ మహిళలు అందించిన తోడ్పాటుకు నివాళిగా దీన్ని ఆరు భాషల్లో ప్రదర్శించారు. ఆ ఆరు భాషల్లో హిందీ కూడా ఉండటం విశేషం. మహిళల హక్కులు కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని తమ నిబద్ధతను చాటుతూ ప్రదర్శించిన ఇన్ఫోగ్రాఫిక్స్ హిందీలో కూడా ఉంది.దీనికి సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.
కాగా, ఇవాళ భారత్ పలు క్రీడాంశాల్లో బరిలోకి దిగుతోంది. షూటింగ్‌లో పతకాల పోటీ నేడే జరగనుంది. షూటింగ్‌తో పాటు టెన్నిస్, టేబుల్ టెన్సిస్, బ్యాడ్మింటన్, రోయింగ్, హాకీ, బాక్సింగ్ పోటీల జరగనున్నాయి. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి మన పోటీలు మొదలుకానున్నాయి. జియో సినిమా, స్పోర్ట్స్ 18లో లైవ్ చూడవచ్చు.