పారిస్ ఒలింపిక్స్ 2024లో విజేతలకు ఇచ్చిన పతకాలు నాసిరకంగా ఉన్నాయంటూ విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విషయమై అథ్లెట్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటికే 100 మంది అథ్లెట్లు తమ పతకాలను వాపస్ కూడా చేసేశారు. అయితే తాజాగా ఇప్పుడీ జాబితాలో భారత స్టార్ అథ్లెట్ మను బాకర్ చేరింది. తన మెడల్ పై ఉన్న పూత తొలగిపోతోందని కంప్లైంట్ చేసింది. కాగా, ఇప్పటికే అథ్లెట్ల నుంచి అందుతోన్న ఫిర్యాదులపై ఐఓసీ స్పందించింది. త్వరలోనే వాటి స్థానంలో కొత్తవి అందిస్తామని తెలిపింది.
'' నా బ్రాంజ్ మెడల్ పై ఉన్న నున్న పూత తొలిగిపోతోంది. ఈ పారిస్ ఒలిపింక్స్‌లో వచ్చిన పతకంలా లేదు. ఎప్పుడో పాతదిలా కనిపిస్తోంది. అందుకే దాన్ని ప్రస్తుతం ఇంట్లో షోకేజ్‌లో పెట్టేశాం. అది మరింత ఎక్కవుగా పాడవుతుందనే భయంతో అస్సలు బయటకు కూడా తీయడం లేదు'' అని మను బాకర్ తండ్రి రామ్ కిషన్ అన్నారు. ఇకపోతే అథ్లెట్లు స్వప్నిల్ కుశాలే, సరబ్‌జోత్ సింగ్ మెడల్స్ కూడా పాడవుతున్నట్లు సమాచారం అందింది.

అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ స్పందన
మెడల్స్ నాసిరకంగా ఉన్నాయని, పాడైపోతున్నాయని వస్తోన్న ఫిర్యాదులపై అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ స్పందించింది. లోపాభూయిష్టంగా ఉన్న 2024 ఒలింపిక్ మెడల్స్ ను మార్చి కొత్తవి ఇస్తామని తెలిపింది. ఫ్రెంచ్ ప్రభుత్వ మింట్ సంస్థ మెడల్స్ తయారీ చేస్తుందని, నాణ్యతకు ఆ సంస్థే బాధ్యత వహిస్తుందని పేర్కొంది. ఈ ప్రక్రియ మరికొన్ని వారాల్లో ప్రారంభం కానుందని చెప్పింది. మరోవైపు చర్చనీయాంశంగా మారిన ఈ విషయంపై ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష కూడా స్పందించింది. మెడల్ నాణ్యత లేదినిగా గుర్తిస్తే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పింది.
ఖండించిన ఫ్రెంచి ప్రభుత్వ మింట్
మెడల్స్ లోపాభూయిష్టంగా ఉన్నట్లు వస్తోన్న విమర్శలపై ఫ్రెంచి ప్రభుత్వ మింట్ స్పందించింది. వాటిని కొట్టిపారేసింది. గత ఆగస్టు నుంచే పాడైపోతోన్న పతకాలను మార్చి ఇచ్చినట్లు తెలిపింది.