పారిస్ ఒలింపిక్స్-2024కు రంగం సిద్ధమైంది. మరో ఎనిమిది రోజుల్లో విశ్వక్రీడలు ప్రారంభం కానున్నాయి. జులై 26 నుంచి మొదలయ్యే ఈ మహా సమరం ఆగస్టు 11 వరకు కొనసాగనుంది. నాలుగేళ్లకోసారి వచ్చే ఈ మెగా టోర్నీలో విజేతగా నిలవాలని ప్రపంచవ్యాప్తంగా అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. అయితే స్వర్ణం లక్ష్యంగా బరిలోకి దిగిన జపాన్ జిమ్మాస్టిక్ టీమ్‌కు ఒలింపిక్స్ ప్రారంభంకాకముందే భారీ షాక్ తగిలింది.
జపాన్ జిమ్నాస్టిక్స్ ఉమెన్స్ టీమ్ కెప్టెన్ షోకో మియాటాపై వేటు పడింది. ట్రైనింగ్ క్యాంప్‌లో ధూమపానం చేసినందకు బరిలోకి దిగకముందే ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించిది. అసలేం జరిగిందంటే.. హ్యాట్రిక్ ఎన్‌హెచ్‌కే ట్రోఫీలు సాధించిన మియాటా పారిస్ ఒలింపిక్స్ అర్హత సాధించింది. తొలిసారి జపాన్ జిమ్మాస్టిక్ జట్టుకు నాయకత్వ బాధ్యతలు అందుకుంది.

1964 టోక్యో ఒలింపిక్స్ తర్వాత మహిళల జిమ్నాస్టిక్స్‌లో జపాన్‌కు తొలి పతకం అందివ్వాలని మియాటా బృందం కసితో సన్నద్ధమైంది. అయితే 19 ఏళ్ల మియాటా క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించింది. ధూమపానంతో పాటు మధ్యం సేవించింది. ఈ విషయంపై జపాన్ ఒలింపిక్ కమిటీ సీరియస్ అయ్యింది. మియాటాను జట్టు నుంచి తప్పిస్తున్నట్లు జపాన్ జిమ్నాస్టిక్స్ అసోషియేషన్ వెల్లడించింది. తమ మహిళల జట్టు నలుగురుతోనే ఒలింపిక్స్‌లో బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించింది. మియాటాను స్వదేశానికి తిరిగి పంపించింది.
అంతేగాక మియాటా తరఫున జపాన్ ప్రజలకు క్షమాపణలు తెలిపింది. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూస్తామని పేర్కొంది. ఈ ఘటన జట్టుపై ప్రభావం చూపదని, తప్పక పతకం సాధిస్తామని జపాన్ జిమ్మాస్టిక్స్ అసోసియేషన్ వెల్లడించింది.