India at Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024 నేటితో ముగియనున్నాయి. ఈ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్ ముగింపు వేడుకలు.. బ్రిటీష్ సమ్మర్ టైమ్ జోన్ ప్రకారం ఈ రాత్రి 8 గంటలకు ఆరంభమౌతాయి. రాత్రి 10:30 గంటల వరకు కొనసాగనున్నాయి. అంగరంగ వైభవంగా ఈ సెలబ్రేషన్స్‌ను నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది ఒలింపిక్స్ కమిటీ.
ఈ సెలబ్రేషన్స్‌లో భారత్ టీమ్‌కు జాయింట్ ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించనున్నాడు పీఆర్ శ్రీజేష్. ఈ మేరకు భారత ఒలింపిక్స్ కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. మనూ భాకర్‌తో కలిసి జాయింట్ ఫ్లాగ్ బేరర్‌గా ఆయనను నామినేట్ చేసినట్లు ఐఓఏ ఇదివరకే వెల్లడించింది. మనుభాకర్, శ్రీజేష్ భారత పతాకాన్ని రెపరెపలాడించనున్నారు.

ఈ ఒలింపిక్స్‌లో భారత్.. ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఆరు పతకాలకే పరిమితమైంది. 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌తో పోల్చుకుంటే ఈ సంఖ్య తక్కువే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ ఏడు వేర్వేరు కేటగిరీల్లో విజయకేతనం ఎగురవేసింది. ఏడు పతకాలను సాధించింది. ఈ సంఖ్య ఇప్పుడు ఆరుకు దిగజారింది.
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మొత్తం ఏడు పతకాలు లభించగా.. అందులో ఒక బంగారం, రెండు వెండి, నాలుగు రజతాలు ఉన్నాయి. 49 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను- రజతం, మహిళల బాక్సింగ్ వాల్టర్‌వెయిట్‌లో లవ్లీనా బొర్గోహెయిన్- రజతం, బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు- రజతం, పురుషుల 57 కేజీల రెజ్లింగ్‌లో రవికుమార్ దహియా- రజతం, హాకీలో రజతం, పురుషుల 65 కేజీల రెజ్లింగ్‌లో బజరంగ్ పునియా- రజతం, జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా బంగారు పతకాలను సాధించారు.
ఇప్పుడా పరిస్థితి లేదు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్‌లో మనుభాకర్- కాంస్యం, మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్‌లో మనుభాకర్- సరబ్జొత్ సింగ్ జోడీ కాంస్యం, పురుషుల 50 మీటర్ల రైఫిల్ షూటింగ్‌లో స్వప్నిల్ కుశాలె కాంస్యం, హాకీలో కాంస్యం, పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా రజతం, పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో అమన్ సెహ్రావత్ కాంస్య పతకాలను సాధించారు.
ఎన్నో అంచనాలను పారిస్‌కు మోసుకెళ్లిన పీవీ సింధు, లవ్లీనా బొర్గోహెయిన్ విఫలం అయ్యారు. జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ వస్తుందనే అంచనాలు సైతం తలకిందులయ్యాయి. స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.