పారిస్ ఒలింపిక్స్ 2024లో భాగంగా ఆదివారం భారత్ గ్రేట్ బ్రిటెయిన్ మధ్య జరిగిన హాకీ క్వార్టర్ ఫైనల్స్‌లో టీమిండియా షూట్-అవుట్ ద్వారా విజయం సాధించింది. ఆట ప్రారంభం అయినప్పటి నుంచే ఇరు జట్లు అటాకింగ్ గేమ్ ఆడటంతో ఆట సమయం ముగిసే సమయానికి ఇరు జట్లు 1-1 స్కోరుతో సమంగా నిలిచాయి. దీంతో షూటౌట్ తప్పనిసరికాగా అందులో భారత్ విజయం సాధించింది.
ఇక భారత్ గెలుపును యావత్ క్రీడాలోకం ప్రశంసించింది. టీమిండియా ఆటగాడు అమిత్ రోహిదాస్‌కు రెడ్ కార్డ్ రావడంతో భారత్ 40 నిమిషాల పాటు 10 ఆటగాళ్లతోనే ఆడింది. ఇక పారిస్ నుంచి అందుతున్న తాజా సమాచారం ఒక మ్యాచ్‌కు అమిత్ రోహిదాస్ పై నిషేధం విధించారు.దీంతో అమిత్ సెమీ ఫైనల్స్ మ్యాచ్‌కు ఈ స్టార్ ఆటగాడు దూరం కానున్నాడు.

ఇప్పటికే భారత హాకీ సమాఖ్య పలు అంశాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇందులో భారత్ గ్రేట్ బ్రిటెయిన్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రిఫరీల నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది.రోహిదాస్ సస్పెన్షన్ పై కూడా సీరియస్ అయిన భారత హాకీ సమాఖ్య ఈ విషయాన్ని అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్‌కు ఫిర్యాదు చేసింది.అయితే దీనిపై అంతర్జాతీయ హాకీ సమాఖ్య విచారణ చేసి సోమవారం రోజున తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
అమిత్ రోహిదాస్‌కు రెడ్ కార్డ్ ఎందుకు ఇచ్చారు..?
ఆదివారం భారత్ గ్రేట్ బ్రిటెయిన్ మధ్య జరిగిన హాకీ క్వార్టర్ ఫైనల్స్‌లో అమిత్ రోహిదాస్‌కు అంపైర్ రెడ్ కార్డు ఇచ్చాడు. ఆట 17వ నిమిషంలో ఈ టీమిండియా డిఫెండర్ రోహిదాస్ బంతితో పాటుగా వెళ్లే ప్రయత్నం చేయగా వెనకాల నుంచి గ్రేట్ బ్రిటెయిన్ ఆటగాడు కల్నన్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే రోహిదాస్ స్టిక్ ఇరుక్కుపోవడం ఆ తర్వాత పొరపాటున కల్నన్ ముఖానికి తగలడం జరిగిపోయింది. వెంటనే రిఫరీల మధ్య చర్చ జరిగి ఆ పై నేరుగా అమిత్ రోహిదాస్‌కు రెడ్ కార్డు ఇచ్చారు. దీంతో మరో 40 నిమిషాల పాటు 10 ఆటగాళ్లతోనే భారత్ డిఫెండ్ చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో నిజంగా ఒక గోడలా నిలబడ్డాడు గోల్ కీపర్ శ్రీజేష్.
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన టీమిండియా ఈ సారి మాత్రం పసిడిపై కన్నేసింది.ఎలాగైన సరే బంగారు పతకాన్ని సాధించి సగర్వంగా భారత గడ్డపై అడుగుపెట్టాలని భావిస్తోంది.న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి మేటి జట్లపై విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో దూసుకుపోతున్నారు భారత కుర్రాళ్లు.