వెనిజులా షూటర్ లియోనెల్ మార్టినెజ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. రెండు ఒలింపిక్స్ మధ్య ఎక్కువ విరామం తీసుకున్న రెండో క్రీడాకారుడిగా చరిత్రకెక్కాడు. 60 ఏళ్ల మార్టినెజ్ 40 ఏళ్ల తర్వాత విశ్వక్రీడల్లో పాల్గొనడం విశేషం. మార్టినెజ్ చివరిగా 1984 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు.
ఈ అరుదైన రికార్డులో అగ్రస్థానంలో జపాన్ ఈక్వెస్ట్రియన్ ఆటగాడు హొకెసు హిరోషి ఉన్నాడు. హొకెసు రెండు ఒలింపిక్స్ మధ్య 44 ఏళ్ల విరామం తీసుకున్నాడు. తొలిసారి 1964 ఒలింపిక్స్‌లో పాల్గొన్న అతను ఆ తర్వాత 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగాడు. కాగా, మార్టినెజ్ విషయానికొస్తే.. 1984 తర్వాత వ్యాపారాల్లో స్థిరపడ్డాడు.

కానీ ఇటీవల మార్టినెజ్ తన మనసు మార్చుకున్నాడు. ఒలింపిక్స్‌లో మరోసారి అడుగుపెట్టాలని తిరిగి తుపాకి చేతపట్టాడు. యువ క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చేలా సన్నద్ధమయ్యాడు. 2023 పాన్ అమెరికన్ క్రీడల్లో రజతం సాధించి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. 60 ఏళ్ల వయసులో తిరిగి విశ్వక్రీడల్లో బరిలోకి దిగాడు. అంతేగాక పురుషుల ట్రాప్ విభాగంలో 28వ స్థానం సాధించాడు.
తన లక్ష్యం వచ్చే ఒలింపిక్స్‌లోనూ పాల్గొనడం అని మార్టినెజ్ చెబుతున్నాడు. ఎక్కడ మొదలుపెట్టానో అక్కడే ముగించాలని ధ్యేయంతో ఉన్నానని తెలిపాడు. 20 ఏళ్ల కుర్రాడిగా 1984 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో మార్టినెజ్ పాల్గొన్నాడు. కాగా, 2028లో జరిగే ఒలింపిక్స్‌కు లాస్ ఏంజెలిస్ వేదిక కానుంది. దీంతో వచ్చే విశ్వక్రీడల్లో పాల్గొనాలని పట్టుదలతో ఉన్నాడు.