పారిస్ ఒలింపిక్స్-2024కు రంగం సిద్ధమైంది. మరో తొమ్మిది రోజుల్లో విశ్వక్రీడలు ప్రారంభం కానున్నాయి. జులై 26 నుంచి మొదలయ్యే ఈ మహా సమరం ఆగస్టు 11 వరకు కొనసాగనుంది. అయితే ఈ సారి ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు భిన్నంగా జరగనున్నాయి. పారిస్‌లో ప్రవహించే సెన్ నదిపై ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించనున్నారు. ఆరంభోత్సవ వేడుకలు స్టేడియంలో కాకుండా ఆరుబయట నదిలో జరగనుండటం ఇదే ప్రథమం.
అయితే పారిస్ ఒలింపిక్స్‌కు ఏర్పాట్లు మొదలైనప్పటి నుంచి సెన్ నది గురించి వార్తలు పెద్దఎత్తున వచ్చాయి. సెన్ నదిలో నీటి నాణ్యత ఆందోళనకరంగా ఉండటమే దానికి ప్రధాన కారణం. వరద, మురికి నీరు కారణంగా ఈ నదిలో 1923 నుంచి స్నానం చేయడంపై నిషేధం విధించారు. కానీ సెన్ నది వేదికగానే ప్రారంభోత్సవ వేడుకలతో పాటు మారథాన్ స్విమ్మింగ్, ట్రయథ్లాన్ స్విమ్మింగ్ తదితర ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ పోటీలు జరగనున్నాయి.

సెన్ నదిలో ఈత కొట్టడం అథ్లెట్లకు శ్రేయస్కరం కాదని, దీంతో వీటి నిర్వహణ దాదాపు అసాధ్యమే అని విమర్శకులు ఆది నుంచి తమ వాదన బలంగా వినిపిస్తున్నారు. మరోవైపు పారిస్ మేయర్ అన్నె హిడాల్గో మాత్రం నదిని పరిశుభ్రంగా చేసి చూపిస్తామని వాగ్ధనం చేశారు. అయితే విశ్వక్రీడలు మరో తొమ్మిది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇచ్చిన మాటను మేయర్ నిలబెట్టుకున్నారు.
సెన్ నదిలో దూకి ఈత కొట్టి నది పరిశ్రుభంగానే ఉందని ప్రపంచానికి అన్నె చాటిచెప్పారు. నిర్వహణ అనుమానాలకు తెరదించుతూ విమర్శకుల నోళ్లు మూయించారు. కాగా, ఫ్రాన్స్ వందేళ్ల తర్వాత మరోసారి ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇస్తుంది. 1900, 1924లో ఒలింపిక్స్‌కూ ఫ్రాన్స్ ఆతిథ్యమిచ్చింది.