పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాను తెరిచిన షూటర్, రెండు కాంస్య పతకాల విజేత మను బాకర్ మూడో మెడల్‌ను తృటిలో చేజార్చుకుంది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్స్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. కాగా, ఫైనల్‌లో స్టేజ్ వన్‌ను కాస్త నెమ్మదిగా ప్రారంభించిన మను ఆ తర్వాత దూకుడు పెంచింది.
సిరీస్ 1,3 లో నాలుగు షాట్లు కొట్టింది. సిరీస్ 6 వరకు అదే దూకుడు కొనసాగించింది.కానీ చివరి సిరీస్‌లో కేవలం రెండు షాట్లకే గురి కుదరడంతో టాప్-3తో నిలవలేకపోయింది. మూడో పతకం చేజారినప్పటికీ మను బాకర్ దేశం గర్వపడేలా ప్రదర్శన చేసింది.

10 మీటర్ల పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి మను కాంస్య పతకం గెలిచిన విషయం తెలిసిందే. అంతకంటే ముందు పది మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకంతోనే ఆమె భారత్ ఖాతాను తెరిచింది. ఓ ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారత అథ్లెట్‌గా మను బాకర్ ఘన చరిత్ర సృష్టించింది.
కాగా, 25 మీటర్ల పిస్టల్ విభాగంలో కొరియాకు చెందిన 21 ఏళ్ల యాంగ్ జిన్ స్వర్ణం సాధించింది. ఫ్రాన్స్ అమ్మాయి కామెలీ రజతం, హంగేరీ షూటర్ వెరోనికా కాంస్యం అందుకుంది. పోరు ముగిసిన అనంతరం మను బాకర్ మాట్లాడింది. రెండు పతకాలతో స్వదేశానికి వెళ్లడం గొప్పగానే ఉందని, కానీ ఇవాళ పోటీలో నాలుగో స్థానం నిలవడం నిరాశ కలిగించిందని మను తెలిపింది.
''రెండు పతకాలతో స్వదేశానికి తిరిగి వెళ్లడం సంతోషంగానే ఉంది. కానీ ప్రస్తుతం నాలుగో స్థానంలో నిలిచాను. దీంతో సంబరాలు చేసుకోవాలనే ఆలోచన లేదు.ఇవాళ ఫైనల్‌లో ఆందోళనకు గురయ్యాను. వచ్చిన ఫలితం సంతృప్తిగా లేదు. ఇక మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు. నాతో మాట్లాడటానికి సమయం వెచ్చించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. అలాగే కోచ్ జస్పాల్ రాణా, ఓజీక్యూ, సాయ్ మీడియా, స్నేహితులు, ఫ్యామిలీకి స్పెషల్ థ్యాంక్స్. అన్ని వేళల్లో నాతో ఉన్న మా అమ్మకు ప్రత్యేక ధన్యవాదాలు'' అని మను బాకర్ పేర్కొంది.