
టోక్యో: జపాన్ వేదికగా జరుగుతున్న టోక్యో పారాలింపిక్స్ 2020లో భారత షూటర్ అవని లేఖరా చరిత్ర సృష్టించింది. ఒకే పారాలింపిక్స్‌లో రెండు మెడల్స్ గెలిచిన తొలి ఇండియన్‌గా అవని రికార్డుల్లో నిలిచింది. ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన అవని.. శుక్రవారం ఉదయం జరిగిన 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఈవెంట్‌లో బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. దీంతో పారాలింపిక్స్ 2020లో అవని రెండు మెడల్స్ ఖాతాలో వేసుకుంది. దాంతో ఒకే పారాలింపిక్స్‌లో రెండు మెడల్స్ గెలిచిన తొలి ఇండియన్‌గా అవని నిలవడం విశేషం.
10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించిన అవని లేఖరా.. పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళగా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. తాజాగా ఒకే పారాలింపిక్స్‌లో రెండు మెడల్స్ గెలిచిన తొలి ఇండియన్‌గా కూడా అవని రికార్డుల్లో నిలిచింది. ఇప్పటివరకు పారాలింపిక్స్‌లో ఏ మహిళా, పురుష అథ్లెట్‌లు రెండు పతకాలు అందుకోలేదు. ఈ క్రమంలో జోగిందర్ సింగ్ బేడీ, మరియప్పన్ తంగవేళు, దేవేంద్ర ఝాజరియా తర్వాత ఒకటి కంటే ఎక్కువ పతకాలు సాధించిన 4వ భారత అథ్లెట్‌గా రికార్డుల్లోకెక్కింది.
అయితే బుధవారం జరిగిన పది మీటర్ల మిక్స్‌డ్ ఎయిర్ రైఫిల్ ప్రోన్ ఎస్‌హెచ్1 పోటీల్లో 19 ఏళ్ల అవని లేఖరా విఫలమైంది. ఆమెతో పాటు సిద్ధార్థ బాబు, దీపక్ కుమార్ సైతం అంచనాలు అందుకోలేకపోయారు. దాంతో మిక్స్‌డ్ ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత్‌కు పతకం అందకుండా పోయింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 ఈవెంట్‌లో సింగ్‌రాజ్ అదానా కాంస్య పతకం చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. మొత్తానికి ఈ పారాలింపిక్స్‌లో మన షూటర్లు సత్తాచాటారు.
శుక్రవారం ఉదయమే భారత్ ఖాతాలో పతకం చేరింది. పురుషుల హై జంప్‌లో ప్రవీణ్ కుమార్ సిల్వర్ మెడల్ సాధించాడు. బంగారు పతకం కోసం జరిగిన ఫైనల్‌లో గ్రేట్ బ్రిటన్‌కు చెందిన జోనాథన్ ఎడ్‌వర్డ్స్ 2.10 మీటర్లు ఎత్తు ఎగిరాడు. అయితే ప్రవీణ్ దీనిని అందుకోవడంలో విఫలమయ్యాడు. దాంతో ప్రవీణ్ కుమార్ (2.07 మీ.) రజతంతో సరిపెట్టుకున్నాడు. పోలాండ్‌కు చెందిన మసీజ్ లెపియాటోకు బ్రోన్జ్ మెడల్ దక్కింది.
విశ్వక్రీడల చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి భారత అథ్లెట్లు దుమ్మురేపుతున్నారు. టోక్యో ఒలింపిక్స్ 2020లో ఏడు పతకాలతో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన అథ్లెట్లను ఆదర్శంగా తీసుకొని పారా అథ్లెట్లు కూడా తమదైన శైలిలో విజృంభిస్తున్నారు. పారాలింపిక్స్ 2020లో భారత్ పతకాల సంఖ్య 12కు చెరింది. ఇందులో రెండు గోల్డ్ (అవని లేఖరా, సుమిత్ అంటిల్), ఆరు సిల్వర్ (ప్రవీణ్ కుమార్, మరియప్ప తంగవేల్, దేవేంద్ర ఝజారియా, యోగేష్ కథునియా, నిషద్ కుమార్, భవీనాబెన్ పటేల్), నాలుగు బ్రాంజ్ (శరద్ కుమార్, సిఘ్రాజ్ అధనా, సుందర్ సింగ్ గుర్జర్, అవని లేఖరా) మెడల్స్ ఉన్నాయి.ఈ రోజు మహిళల క్లబ్ త్రో, బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్ పోటీలు కూడా ఉన్నాయి. ఇందులో కూడా మనోళ్లు మెరిసే అవకాశం ఉంది.