
టోక్యో: జపాన్ వేదికగా జరుగుతున్న టోక్యో పారాలింపిక్స్ 2020లో భారత అథ్లెట్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ విభాగంలో భారత్‌కు స్వర్ణం రాగా.. తాజాగా జావెలిన్ త్రోలో కూడా గోల్డ్ మెడల్ వచ్చింది. జావెలిన్ త్రోలో భారత అథ్లెట్ సుమిత్ అంటిల్ సోమవారం స్వర్ణం సాధించాడు. జావెలిన్ త్రోలో ఈటెను 68.55 మీటర్ల దూరం విసిరి పసిడి సొంతం చేసుకున్నాడు. మెన్స్ జావెలిన్ త్రో ఎఫ్64 విభాగంలో పోటీపడిన భారత పారా అథ్లెట్ సుమిత్.. ప్రపంచ రికార్డు త్రోలతో గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. ఇదే పోటీలో ఉన్న మరో భారత అథ్లెట్ సందీప్ కూడా అత్యధికంగా 62.20 మీటర్ల దూరం ఈటెను విసిరి తృటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు. ప్రస్తుతం భారత్ పతకాల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతుంది.
సుమిత్ అంటిల్ తన మొదటి ప్రయత్నంలోనే ఈటెను 66.95 విసిరి ప్రపంచ రికార్డు సృష్టించాడు. రెండో ప్రయత్నంలో ఏకంగా 68.08 మీటర్లు విసిరి తన రికార్డును తానే అధిగమించాడు. మూడో ప్రయత్నంలో 65.27 మీటర్లు, నాలుగో ప్రయత్నంలో 66.71 మీటర్ల దూరంను ఈటెను సుమిత్ విసిరాడు. ఇక తన ఐదో ప్రయత్నంలో 68.55 మీటర్లు విసిరి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐదో అటెంప్ట్‌లో ఈ ఫీట్ సాధించడం ద్వారా సుమిత్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇదే ఈవెంట్‌లో పోటీపడిన మరో భారత పారా అథ్లెట్ సందీప్ చౌదరీ అత్యుత్తమంగా 62.03 మీటర్లు ఈటెను విసిరి.. నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
సుమిత్ అంటిల్ సాధించిన గోల్డ్ మెడల్‌తో కలిపి టోక్యో పారాలింపిక్స్ 2020లో భారత్ ఇప్పటివరకు రెండు బంగారు పతకాలు సాధించినట్లయ్యింది. మొత్తంగా పతకాల సంఖ్య ఏడుకు చేరింది. నిజానికి భారత పారా అథ్లెట్లు పారాలింపిక్స్ 2020లో సాధించింది 8 పతకాలు. అయితే డిజేబిలిటీ క్లాసిఫికేషన్‌లో వినోద్ కుమార్ అనర్హుడిగా తేలింది. దాంతో అతనికి దక్కిన కాంస్య పతకాన్ని పారాలింపిక్స్ 2020 నిర్వాహకులు రద్దు చేశారు. దాంతో పారాలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య మళ్లీ ఏడుకి చేరింది.
అంతకుముందు అవనీ లేఖరా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్1 ఫైనల్‌లో స్వర్ణ పతకం సాధించింది. ఫలితంగా 19 ఏళ్ల అవనీ.. పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తొలి మహిళగా రికార్డులకెక్కింది. కాగా టోక్యో పారాలింపిక్స్ 2020లో భారత్ ఇప్పటి వరకు రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఓ కాంస్య పతకం సాధించి పతకాల పట్టికలో 25వ స్థానానికి ఎగబాకింది. ఈ జాబితాలో చైనా 119 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. రైఫిల్ షూటింగ్‌లో అవనీ లేఖరా స్వర్ణం సాధించగా టీటీలో భవీనా పటేల్, మెన్స్ హైజంప్ ఈవెంట్‌లో నిషద్ కుమార్, డిస్కస్ త్రో ఈవెంట్‌లో యోగేశ్ కతునియా, జావెలిన్ త్రో ఎఫ్46లో దేవేంద్ర జాజారియా రజత పతకాలు సాధించారు.