న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మిర్జాకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్నకు ఎంపిక చేయడం పట్ల 2012 పారాలింపిక్స్ రజక పతక విజేత తన ఆవేదన వెళ్లగక్కాడు.
రాజీవ్ గాంధీ ఖేల్ రత్నకు సానియా మిర్జా పేరుని సెలక్షన్ ప్యానెల్ ప్రతిపాదించడం 'అన్యాయం' అని పేర్కొన్నాడు. 2012 లండన్ పారాలింపిక్స్ పోటీల్లో రజత పతక విజేత గిరీశ హోసనగెరె నాగరాజె గౌడ కేంద్రం తీరుపై తన అసంతృప్తి వ్యక్తం చేశాడు.

హాసన్‌కు చెందిన హెచ్ఎన్ గిరీశ లండన్ గేమ్స్‌లో రజక పతకం, 2014లో ఇంచియాన్‌లో జరిగిన ఆసియా పారా గేమ్స్‌లో కాంస్య పతకం సాధించాడు. ఖేల్ రత్న అవార్డు కోసం కేంద్రం అనుసరించే పాయింట్ల విధానం ప్రకారం తాను 90 పాయింట్లతో రేసులో ముందున్నానని, సానియా మిర్జా నా దరిదాపుల్లో కూడా లేదని తెలిపాడు.
సానియా మిర్జా గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన సంగతి తనకు తెలుసునని, క్రీడా మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం 2011 నుంచి జరిగిన ఒలింపిక్స్, పారాలింపిక్స్, ఏషియాడ్, కామన్వెల్త్ క్రీడలు, వరల్డ్ చాంపియన్ షిప్స్‌లో ప్రదర్శనలే ఈ అవార్డు కోసం పరిగణనలోకి తీసుకుంటారని వివరించాడు.

"ఇది అన్యాయం. నన్ను వదిలేసి సానియా మిర్జాను ఎంపకి చేశారు. 2012లో నేను పతకం సాధించినప్పుడు నరేంద్ర మోడీ గారు గుజరాత్ సీఎంగా ఉన్నారు. నన్ను తొలిగా అభినందించింది ఆయనే" అని తన ఆవేదనను వ్యక్తం చేశాడు.
తనపట్ల కేంద్రం ప్రభుత్వం ఎలా వివక్ష చూపిందో కూడా ఉదహరించాడు. క్రికెటర్ ధోనికి ఖేల్ రత్న ఇవ్వడాన్ని కూడా ప్రస్తావించాడు. "2013లో నేను ఖేల్ రత్నకు దరఖాస్తు చేసుకుంటే అర్జున అవార్డు అందుకున్నవాళ్లే ఈ అవార్డుకు అర్హులని చెప్పారు. అలాగైతే, ధోనీకి 2007-08లో ఖేల్ రత్న ఎలా ఇచ్చారు?" అని గిరీశ ప్రశ్నించాడు.