న్యూఢిల్లీ: ప్రయాణికుల పట్ల బ్రిటిష్ ఎయిర్ లైన్స్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఆగ్రహం వ్యక్తం చేసి కొన్ని గంటలు కూడా గడవక ముందే... తాజాగా మరో ఎయిర్ లైన్స్ అలసత్వం వెలుగు చూసింది.
ప్రపంచ కప్ పోటీకి వెళ్తున్న భారతీయ క్రీడాకారుడు ఎయిర్ లైన్స్ అలసత్వం వల్ల తన రైఫిల్స్‌ను పోగొట్టుకున్నాడు. భారత పారా షూటర్ రాజీవ్ మాలిక్ అమెరికాలోని ఫోర్ట్ బెన్నింగ్‌లో జరుగుతున్న ఐపీసీ షూటింగ్ ప్రపంచ కప్ పోటీల్లో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి అట్లాంటా బయలుదేరాడు.

అయితే అట్లాంటా విమానాశ్రయంలో దిగిన తర్వాత రాజీవ్ తన రెండు రైఫిల్స్ ఉన్న బ్యాగ్ లేకపోవడం గమనించాడు. ఎయిర్ లైన్స్ సిబ్బందికి సమాచారమివ్వగా బ్యాగ్ చేరగానే అందిస్తామని చెప్పారు.
మూడు రోజులు గడిచినా ఎయిర్‌లైన్స్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో రాజీవ్ తన తోటి ఆటగాడి రైఫిల్ తీసుకుని పోటీల్లో పాల్గొనవలసి వచ్చింది.
పైగా పోయిన రైఫిల్స్ కూడా మాలిక్ మరో ఆటగాడి వద్ద అరువు తీసుకున్నవే కావడం గమనార్హం. పోటీలు ముగించుకుని తిరిగి వస్తుండగా ఆమ్‌స్టర్‌డ్యామ్‌లో లగేజీ ఉన్నట్లు ఎయిర్ లైన్స్ సిబ్బంది రాజీవ్‌కు చెప్పారు.