పారిస్ పారాలింపిక్స్‌లో పతకాలతో సత్తాచాటిన భారత పారా అథ్లెట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం అభినందించారు. తన నివాసంలో పతక విజేతలతో కలిసి మోదీ సరదగా ముచ్చటించారు. జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించిన నవదీప్ సింగ్‌తో, మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్‌లో రాకేశ్ కుమార్‌తో కలిసి కాంస్యం గెలిచిన శీతల్ దేవీతో మోదీ ఆప్యాయంగా మాట్లాడారు.
ఈ సందర్భంగా శీతల్ దేవి ప్రధాని నరేంద్ర మోదీకి జెర్సీని గిప్ట్‌గా ఇచ్చారు. ఆమె కాలితో జెర్సీపై సంతకం చేసి ప్రధానికి బహుకరించారు. కాగా, గత కొన్నాళ్లుగా 17 ఏళ్ల శీతల్ అంతర్జాతీయ వేదికపై అసాధారణ విజయాలు సాధిస్తున్న విషయం తెలిసిందే. రెండు చేతులు లేకపోయినా కాలితో విల్లును పట్టి, భుజంతో నారిని లాగి బాణాలు సంధిస్తోంది.

ఇటీవల జరిగిన పారిస్ పారాలింపిక్స్‌లో ఆమె మహిళల వ్యక్తిగత, మిక్స్‌డ్ టీమ్ విభాగాల్లో పోటీపడింది. వ్యక్తిగత విభాగంలో పతకం సాధించలేకపోయినా మిక్స్‌డ్ టీమ్ విభాగంలో సత్తాచాటింది. సహచర ఆర్చర్ రాకేశ్ కుమార్‌తో కలిసి కంచు మోత మోగించింది. కాగా, ఈ పారా విశ్వక్రీడల్లో మన క్రీడాకారులు 29 పతకాలు సాధించారు.
ఏడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, 13 కాంస్య పతకాలు సాధించారు. పతకాల పట్టికలో 18వ స్థానంలో దేశాన్ని సగర్వంగా నిలబెట్టారు. గత టోక్నో పారాలింపిక్స్ 19 పతకాలను ఆదిలోనే అధిగమించి అదరగొట్టారు. 1968 నుంచి పారాలింపిక్స్‌లో భారత్ పోటీపడగా.. 2016 పారాలింపిక్స్ వరకు మన క్రీడాకారులు 12 పతకాలే సాధించారు. కానీ ఆ తర్వాత కథ మారింది. గత రెండు పారాలింపిక్స్‌లో ఏకంగా 48 పతకాలు సాధించారు.