హైదరాబాద్: తనకు పద్మభూషణ్ పురస్కరాన్ని ప్రకటించక పోవడంపై 16 సార్లు ప‍్రపంచ బిలియర్డ్స్, స్నూకర్ చాంపియన్ టైటిల్ సాధించిన పంకజ్ అద్వానీ అసహనం వ్యక్తం చేశాడు. ఈ పురస్కారానికి తాను ఎంపిక కావాలంటే ఇంకా సాధించాలో తనకు అర్థంకావడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు.
వరుసగా రెండో ఏడాదీ తనను నిరాశకు గురి చేశారని సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. బెంగళూరుకు చెందిన పంకజ్ అద్వానీ గత ఎనిమిదేళ్లుగా వరుసగా ప్రపంచ టైటిళ్లు సాధించాడు. భారత్ అత్యుత్తమ బిలియర్డ్స్, స్నూకర్ ఆటగాళ్లలో ఒకడిగా పేరు సంపాదించాడు.
ఈ క్రమంలో అతనికి పద్మభూషణ్ అవార్డు ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వంతో పాటు భారత బిలియర్డ్స్, స్నూకర్ సమాఖ్య కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశాయి. కాగా బుధవారం పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం అతని పేరును పరిగణలోకి తీసుకోలేదు. దీంతో నిరాశకు గురైన పంకజ్ సోషల్ మీడియాలో తన ఆవేదనను వ్యక్తం చేశాడు.
ఇటీవల పుణెలో 28వ జాతీయ టైటిల్‌ను గెలుచుకున్న పంకజ్ అద్వానీని కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయెల్ అభినందించాడు. 'కృతజ్ఞతలు సర్. 16 ప్రపంచ టైటిళ్లు, ఆసియా క్రీడల్లో 2 స్వర్ణాలు సాధించా. ఐనా పద్మభూషణ్‌కు నన్ను పక్కన పెడుతున్నారంటే ఇంకా నేనేం సాధించాలో అర్థంకావడం లేదు' అని కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయెల్‌కు ట్వీట్ చేశాడు.
అందుకు అతను ధన్యవాదాలు తెలుపుతూ, తాను 16 ప్రపంచ టైటిళ్లు, ఆసియా గేమ్స్‌లో రెండు స్వర్ణాలు సాధించానని, అయినా తనకు పద్మభూషణ్ అవార్డుకు పరిగణనలోకి తీసుకోలేదని, ఇంకా ఏం సాధించాలో తనకు అర్థంకావడం లేదంటూ కేంద్ర మంత్రిని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు. 2006లో రాజీవ్ ఖేల్‌రత్న పురస్కారాన్ని అందుకున్న పంకజ్ అద్వానీ 2009లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు.